రబీలోనూ రుణాలు హుళక్కే! | Farmers waiting for loans | Sakshi
Sakshi News home page

రబీలోనూ రుణాలు హుళక్కే!

Published Tue, Nov 18 2014 2:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణాల కోసం బ్యాంకు దగ్గర  పడిగాపులు కాస్తున్న రైతులు (ఫైల్ ఫొటో) - Sakshi

రుణాల కోసం బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్న రైతులు (ఫైల్ ఫొటో)

అక్టోబర్లో సీజన్ మొదలైనా ఇప్పటికీ రుణాలివ్వని బ్యాంకులు
   పంటల బీమా సొమ్మును కేంద్రం మంజూరు చేసినా అదీ దక్కని వైనం

 సాక్షి, హైదరాబాద్: అన్నదాత కష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రుణాల్ని మాఫీ చేస్తానన్న సర్కారు... మాఫీ సంగతి అటుంచి కనీసం వడ్డీ కూడా చెల్లించటం లేదు. దీంతో రుణాలు రెన్యువల్ కాక వడ్డీ భారం అంతకంతకూ పేరుకుపోతోంది. పోనీ గతేడాది ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటకు బీమా పరిహారమైనా చేతికందుతుందనుకుంటే అదీ లేదు. కేంద్రం నుంచి ఆ సొమ్ము రైతులకోసం విడుదలైనా బ్యాంకులు తమ బకాయిల కింద జమ చేసేసుకుంటున్నాయి. కొత్త రుణాలు రాక... పాత రుణాలు తీరక... వడ్డీ పెరిగిపోతూ... కనీసం పంట బీమా సొమ్ము కూ డా చేతికందక అన్నదాత విలవిల్లాడుతున్నాడు.


 రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇప్పటికీ దాన్ని నెరవేర్చకపోవటంతో ఖరీఫ్‌లోనే కాదు రబీలోనూ రైతులకు బ్యాంకులు రుణాలివ్వటం లేదు. ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ ఆరంభమైనా ఒక్క పైసా కూడా రైతుల రుణం మాఫీ కాక పోవటంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలివ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 20 శాతం నిధులైనా డిసెంబర్ కన్నా ముందు బ్యాంకులకు చేరితే... అప్పుడే రబీలో రైతుల రుణాలు రెన్యువల్‌కు కొంత అవకాశం ఉంటుందని, లేదంటే ఖరీఫ్‌లానే రబీలోనూ రైతులకు రుణం పుట్టదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇస్తానంటున్న 20 శాతం నిధులు గనక నిజంగా ఇస్తే... అవి వడ్డీకి సరిపోతే... అప్పుడే రుణాల్ని బ్యాంకులు రెన్యువల్ చేస్తాయని, ఒకవేళ ఆ నిధులు సరిపోని పక్షంలో మిగిలిన వడ్డీని రైతులు చెల్లించాల్సి ఉంటుందని ఆ వర్గాలు చెప్పాయి.


 ఖరీఫ్‌లో బ్యాంకుల ద్వారా రుణ లక్ష్యం రూ.56,019 కోట్లుగా నిర్ధారించినా... బ్యాంకులు మాత్రం బకాయిల్ని చెల్లించిన రైతులకు గాను కేవలం రూ.9,000 కోట్ల కొత్త రుణాలు  మంజూరు చేశాయి. ఇపుడు రబీలో పంట రుణం, టర్మ్ రుణం, వ్యవసాయ అనుంబంధ రంగాల కింద మొత్తం రూ.23,110 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించారు. అయితే నవంబర్ నెలాఖరు వస్తున్నా రైతులకు పైసా రుణం పుట్టలేదు. తొలుత 20 శాతం రుణాన్ని మాఫీ చేస్తామంటూ రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ సంస్థకు రూ.ఐదు వేల కోట్లు ఇస్తున్నట్లు జీవో జారీ చేయడం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆ 20 శాతంలో ఒక్క పైసా కూడా బ్యాంకులకు చేరలేదు. ఇదంతా చూస్తుంటే ఖరీఫ్‌లానే రబీ కూడా ముగిస్తారనే ఆందోళనను రైతు సంఘాలు వ్యక్తంచేస్తున్నాయి. ఆధార్, రేషన్ నంబర్లు లేవంటూ ఏకంగా 24.8 లక్షల ఖాతాలను జన్మభూమి కమిటీల ద్వారా తనిఖీలకు పంపించారు. ఈ తనిఖీలు పూర్తయి, మంగళవారానికల్లా బ్యాంకులు ఆ వివరాల్ని ఆన్‌లైన్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. తరవాత అర్హులైన కుటుంబాలను గుర్తించి ఈ నెల 21 లేదా 22వ తేదీ నాటికల్లా 20 శాతం నిధులను బ్యాంకులకు జమ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆచరణలో ఎంతవరకు ఇది అమలవుతుందనేదానిపైనే రబీ రుణాల మంజూరీ ఆధారపడి ఉంది.


 బీమా సొమ్ము రూ. 270 కోట్లు జమ: గతేడాది ఖరీఫ్ సీజన్‌లో పంటలు కోల్పోయిన రైతులకు పంటల బీమా కింద కేంద్రం విడుదల చేసిన సొమ్మును బ్యాంకులు రైతు బకాయిల కింద జమచేసుకున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ పంటల బీమా కింద తొలి దశలో కేంద్ర ప్రభుత్వం రూ. 270 కోట్లను శనివారం విడుదల చేసింది. ఈ నిధులు ఆయా బ్యాంకులకు సోమవారం చేరాయి. అవన్నీ రైతుల ఖాతాల్లోకి చేరి, రైతులు డ్రా చేసుకోవాల్సి ఉంది. కానీ రుణ మాఫీ అమలు చేయకపోవటం వల్ల రైతులంతా బ్యాంకులకు బకాయిలు పడ్డారు. ఆ బకాయిల కింద ఈ మొత్తాల్ని బ్యాంకులు మినహాయించుకున్నాయి. బీమా సొమ్మును తమకివ్వాలని ప్రభుత్వం కోరినా అందుకు బ్యాంకులు నిరాకరించాయి. రెండో దశలో మరో రూ.300 కోట్లు బీమా కింద కేంద్రం నుంచి రావాల్సి ఉన్నట్లు సమాచారం. దాన్ని కూడా రైతుల రుణ బకాయిల కింద జమ చేసుకుంటామని బ్యాంకు వర్గాలు తెలియజేశాయి. రెండు నెలలు క్రితం వచ్చిన 2012-13 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ బీమా సొమ్ము రూ.68 కోట్లను సైతం బ్యాంకులు రుణ బకాయిలగా జమ చేసుకోవటం ఈ సందర్భంగా గమనార్హం. మామూలుగా పంటల బీమా ప్రీమియంలో రైతులు 50 శాతం చెల్లిస్తే మిగతా 50 శాతాన్ని కేంద్రం, రాష్ట్రం చెరిసమానంగా సమకూరుస్తాయి. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలకు బీమా సౌకర్యమే లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement