మళ్లీ ఎప్పటిలా అదే బాగోతం కొనసాగింది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో రైతులకు, బలహీనవర్గాలకు రుణాలివ్వడంలో బ్యాంకులు ఘోరంగా విఫలమయ్యాయి. శనివారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో వెల్లడైన గణాంకాలు చూస్తే గుండె చెరువవుతుంది. ఏటా ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించడం, ఆ ఏడాదికి ఏఏ వర్గాలకు ఎంతెంత రుణాలివ్వాలో నిర్ణయించడం... క్రియకొచ్చేసరికి మొండిచేయి చూపడం రివాజుగా మారింది. ఈ పరిస్థితికి మిగిలిన వర్గాల మాటెలా ఉన్నా రైతులు మాత్రం అలవాటు పడిపోయారు. వ్యవసాయ రుణాల కోసం కాళ్లరిగేలా బ్యాంకులు చుట్టూ తిరగడానికి బదులు ఏ వడ్డీ వ్యాపారినో నమ్ముకుంటే సమయమైనా సద్వినియోగమవుతుందన్న నిర్ణయానికొచ్చేశారు. నిరుడు జూన్‌లో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించినప్పుడు వ్యవసాయ రంగం ప్రాధాన్యరంగాల్లో మొట్ట మొదటిదని బ్యాంకర్లకు చెప్పారు. తీరా ఇవ్వదల్చుకున్న రుణాలు ఏపాటో చూశాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. అంతక్రితం ఏడాది రూ.1,42,900 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా నిరుడు అది కాస్తా రూ.1,33,074కు దిగజారింది. తీరా ఇప్పుడు ఇచ్చిందేమో రూ.91,353 కోట్లు మాత్రమే! ఖరీఫ్, రబీలకు ముందటేడాది రూ.50,157 కోట్ల రుణాలివ్వగా... 2013-14 సంవత్సరానికి దాన్ని రూ. 50,000 కోట్లకు కుదించారు. విత్తనాల దగ్గరనుంచి పురుగుమందులు, ఎరువుల వరకూ అన్నిటి ధరలూ పెరిగి తడిసిమోపెడవుతున్న వేళ రుణాల మొత్తాన్ని ఇతోధికంగా పెంచాల్సివుండగా ఇలా కోత కోశారు. తీరా ఇచ్చింది చూస్తే కేవలం రూ. 28,820 కోట్లు మాత్రమే. అంటే అనుకున్న లక్ష్యంలో 57 శాతం రుణాలు మాత్రమే ఇచ్చారన్న మాట! ఇందులో బుక్ అడ్జెస్ట్‌మెంట్ల భాగమెంతో ఆరా తీస్తే వాస్తవ రుణాల బండారం బయటపడుతుంది. అసలు ఏ రంగానికి ఎంత మొత్తం రుణంగా ఇవ్వాలో నిర్ణయించుకునేముందు అంతక్రితం సంవత్సరం ఇచ్చిన రుణాలెంతో ఓసారి చూసుకోవాలి. కానీ, అందుకు భిన్నంగా ఆ ఏడాది లక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త లక్ష్యాలను నిర్ణయించారు. ఇలా చేయడంలోని సహేతుకత ఏమిటో అర్ధంకాదు. ఇచ్చిన రుణాలు ఎంతో లెక్కేసుకుని... అనుకున్న లక్ష్యాలేమిటో గమనించుకుని...ఆ లక్ష్యాలను సాధించలేకపోవడానికి కారణాలేమిటో సమీక్షించుకుంటే నూతన లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. కానీ, అందుకు భిన్నంగా పోవడంవల్ల రైతులకు మాత్రమే కాదు...అందరికీ అరకొర సాయమే దక్కింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఇస్తామన్న రూ. 10,018 కోట్లలో కేవలం రూ. 3,395 కోట్లు మాత్రమే అందజేశారు. రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భారీయెత్తున రుణాలు అందించబోతున్నట్టు నిరుడు చెప్పిందంతా క్రియకొచ్చే సరికి ఊకదంపుడుగా మిగిలిపోయిందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.
బ్యాంకులిచ్చే రుణాల్లో వ్యవసాయ రుణాలు 18 శాతం ఉండాలని రిజర్వు బ్యాంకు నిబంధనలు చెబుతున్నా అవి పాటించడం అరుదే. ఏ బ్యాంకూ రిజర్వు బ్యాంకు నియమాలను అమలుచేయదు. ఫలితంగా గ్రామసీమల్లో రైతులు వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తున్నది. బ్యాంకులు ఇచ్చే రుణాలవల్ల ప్రైవేటు అప్పులు తీసుకునే రైతుల సంఖ్య బాగా తగ్గిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 14.5 ఉండగా, గత ఏడాది మన వ్యవసాయ ఎగుమతులు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థను ఇంతగా ఆదుకుంటున్న రైతుపై ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయో ఈ రుణ బాగోతాన్ని చూస్తే అవగతమవు తుంది. ఇకపై కౌలు రైతులకు సైతం సులభంగా బ్యాంకు రుణాలు లభిస్తాయని ప్రభుత్వం చెప్పిన మాటల్లోనూ వాస్తవం లేదని ఈ ఏడాది లెక్కలు చెబుతున్నాయి. కౌలు రైతులకు ప్రత్యేకించి రూ.2,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇచ్చింది కేవలం రూ.315 కోట్లు మాత్రమే. కౌలు రైతులపై బ్యాంకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని వ్యవసాయమంత్రి రఘవీరారెడ్డి ఈ సమావేశంలోనే అన్నారు గానీ... దాన్ని సరిచేసేందుకు తమవైపుగా చేసిన కృషి ఏమిటో చెబితే బాగుండేది. అదే సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒప్పుకున్నట్టు గత ఏడాదంతా విద్యుత్ కోతలతోనే గడిచిపోయింది. పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు వ్యవసాయం కూడా దెబ్బతింది. విద్యుత్ పంపు సెట్లపై ఎక్కువగా ఆధారపడే రబీ వ్యవసాయం కూడా ప్రస్తుతం సర్కారు పుణ్యమా అని కోతలతో సాగుతోంది. రోజుకు 5 గంటల విద్యుత్ కూడా రావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కళ్లెదురుగా ఇలా కనబడుతుంటే వచ్చే ఏడాది దివ్యంగా ఉంటుందని సీఎం చేస్తున్న ప్రసంగాలను విశ్వసించేదెవరు?
బ్యాంకర్లు ఒక్క రైతులను మాత్రమే కాదు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలనూ చిన్నచూపు చూస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్‌ద్వారా ఇవ్వాలనుకున్న రుణాల్లో 47 శాతం, ఎస్టీ కార్పొరేషన్‌ద్వారా కేవలం 13 శాతం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 52 శాతం, బీసీ కార్పొరేషన్ 67 శాతం మందికి మాత్రమే రుణాలిచ్చారు. బీసీ సమాఖ్యలకు సంబంధించి 37,000 సొసైటీలకు రుణాలివ్వా లని నిర్దేశించుకుని ఒక్క సొసైటీకి కూడా అప్పులివ్వలేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధమవుతుంది. ప్రభుత్వానికి శ్రద్ధంటూ ఉంటే బ్యాంకుల నుంచి వేర్వేరు వర్గాలవారికి రుణాలు అందే తీరు ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పర్యవేక్షించడం...లక్ష్యాలకు అనుగుణంగా వాటిని ముందుకు కదిలించడం పెద్ద కష్టంకాదు. సర్కారునుంచి ఆ చొరవ లోపించడంవల్ల బ్యాంకులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి. పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
రుణగండం...!
Published Tue, Jan 7 2014 11:37 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement