ఎస్‌బీఐ ఎదుట రైతుల ధర్నా
పెదనందిపాడు: బంగారంపై తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీకి నిరసనగా వరగాని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదుట సోమవారం రైతులు, మహిళలు ధర్నా చేశారు. బ్యాంకు గేటు మూసి వేసి ఎవ రూ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుణాలు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని లోన్‌లు 62 మందికి నోటీసులు పంపించారని తెలిపారు.
బంగారాన్ని ఈ నెల పదో తేదీనవేలం వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారని వాపోయారు. ఈ నెల ఏడో తేదీన పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పి నాలుగో తేదీనే ఇచ్చారని తెలిపారు. ధర్నా విషయం తెలుసుకుని ఎస్‌ఐ లోకేశ్వరరావు బ్యాంకు వద్దకు చేరుకుని రైతులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం రైతు ప్రతినిధులు బ్యాంక్ మేనేజర్‌తో చర్చించారు.
వేలం ఆగదు : మేనేజర్
నిబంధనల మేరకు నోటీసులు జారీ చేశామని మేనేజర్ వి.కృష్ణమూర్తి రైతు ప్రతినిధులకు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు త్వరగా రుణాలు చెల్లిస్తే వేలం ఆపుతామని చెప్పారు. 30 నెలలు గడిచిన 62 మందికి మాత్రమే నోటీసులు పంపించినట్లు తెలిపారు. గడువు లోపు రుణాలు చెల్లించకపోతే వేలం ఆగదని స్పష్టం చేశారు. మేనేజర్‌ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు నూనె శేషగిరిరావు, రైతులు పి.వెంకటప్పయ్య, జి.నాని, కొల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.