
రుణం తీర్చుకున్నారు
► శ్మశాన వాటిక వరకు పార్ధీవదేహాన్ని మోసుకెళ్లిన కుమార్తెలు
► తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించిన కూతురు
కూర్మన్నపాలెం(గాజువాక): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన తండ్రి అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు ఆయన కుమార్తెలు. 53వ వార్డు వడ్లపూడి నిర్వాసిత కాలనీకి చెందిన కనమరెడ్డి అప్పలరాజు టీడీపీ జిల్లా కార్యదర్శిగా సేవలందించేవాడు. ఈనెల 24న స్టీల్‌ప్లాంట్ నుంచి కూర్మన్నపాలెం వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. అప్పలరాజుకు నలుగురు కుమార్తెలు.
వీరిలో ముగ్గురికి వివాహం కాగా చిన్న కుమార్తె రమ్య ఎల్ అండ్ టీ కంపెనీలో పనిచేస్తోంది. ఈమె తన తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకొచ్చింది. అప్పలరాజు పార్ధీవ దేహాన్ని నలుగురు కుమార్తెలు శ్మశానం వరకు మోసుకెళ్లారు. అనంతరం తండ్రి పార్ధీవ దేహనికి చిన్న కుమార్తె రమ్య తలకొరివి పెట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కంటతడి పెట్టారు. ఇదిలావుండగా ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రికి అప్పలరాజు నేత్రదానం చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.