నాన్నకు చదువంటే ఇష్టం: గోపీచంద్
‘నాన్న టీ కృష్ణకు చదువంటే ఎంతో ఇష్టం’ అని సినీ నటుడు గోపీచంద్ అన్నారు. ఒంగోలులో మంగళవారం నిర్వహించిన టీ కృష్ణ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: ‘నాన్నకు చదువంటే ఎంతో ఇష్టం. పేదరికం కారణంగా చదువుకోలేకపోతున్న వారికి భవిష్యత్‌లో మరింత సాయం అందిస్తానని’ సినీ హీరో, టీ కృష్ణ తనయుడు గోపీచంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటీలు స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన టీ కృష్ణ 28వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 28 ఏళ్ల నుంచి టీ.కృష్ణ వర్ధంతిని ఒంగోలులో అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రజలు నిర్వహించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు పేద విద్యార్థులకు చిన్న సాయం అందిస్తున్నానని, భవిష్యత్‌లో ఎక్కువ మందికి సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీ అభిమానం, నాన్న ఆశీస్సులు ఉండటమేనని గోపీచంద్ తెలిపారు. జిల్లాపరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ టీ కృష్ణ జిల్లాలో ఒక వెలుగు వెలిగారన్నారు. విప్లవ భావాలు, విప్లవోద్యమాలు, అభ్యుదయవాదాలతో ముందుకు సాగారన్నారు. టీ కృష్ణ తీసిన సినిమాలు సమాజానికి కావలసిన అంశాలను ప్రస్తావించేవన్నారు. టీ కృష్ణ తనయుడు గోపచంద్ కూడా అడపాదడపా సమాజాన్ని చైతన్యపరిచే, మేలుకొలిపే సినిమాల్లో నటించాలని నూకసాని బాలాజీ కోరారు.
ప్రజానాట్యమండలి నాయకుడు పోలవరపు సీతారామయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్‌వీ శేషయ్య, జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య నాయకుడు పీ వీరాస్వామి, కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటీ ప్రతినిధి మోపర్తి నాగేశ్వరరావు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు నిడమానూరి నాగేశ్వరరావు, అన్నెం కొండలరాయుడు, షంషేర్ అహ్మద్, ఎస్‌డీ ఫజు లుల్లా, ఆళ్ల వెంకటేశ్వరరావు, పొన్నూరి వెంకటశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 20 మంది పేద విద్యా ర్థులకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని గోపీచంద్ అందించారు. కృష్ణ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీలు అందించారు. గోపీచంద్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఒక్కసారిగా వేదికపైకి ఎక్కేశారు. కొంతమంది మహిళలు చిన్న బిడ్డలతో తోసుకుంటూ రావడంతో గోపీచంద్ వారిని సున్నితంగా మందలించారు.చివరకు పోలీసు లు, నిర్వాహకులు గోడగా నిలబడి గోపీచంద్‌ను ఆయన కారు వరకు తీసుకువెళ్లారు.