అంతా భ్రాంతియేనా?
- ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం నింపిన సీఎం పర్యటన
- నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంపై కినుక
- తమకంటే అధికారులకే అధిక ప్రాధాన్యంపై గుర్రు
- మంత్రుల ఆధిపత్య సమస్యపై మౌనంతో నీరసం
అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అధిష్టానంపై క్రమేపీ భ్రమలు తొలగిపోతున్నాయి. ప్రభుత్వం తమదే కావడంతో ఇక తిరుగులేదని భావించిన నేతలకు క్రమంగా తత్వం బోధపడుతోంది. పేరుకు అధికారపార్టీ వారే అయినా కేవలం అలంకారప్రాయంగా మారే వైనంతో మింగలేక కక్కలేక తమనితాము నిందించుకుంటున్నారు.
సాక్షి,విశాఖపట్నం: జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబుకు సమస్యలు వినిపించి నియోజకవర్గాలకు నిధులు,హామీలు పొందేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నీరసపడిపోయారు. సీఎంగా రెండు రోజుల పర్యటనలో కనీసం తమ సమస్యలు కూడా వినే ప్రయత్నం చేయకపోవడంతో వారిలో నిరుత్సాహపు నీడలు కమ్ముకుంటున్నాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంగపడుతున్నారు. తమకంటే అధికారులకే ప్రాధాన్యం పెరగడంతో ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో శుక్ర,శనివారాల్లో చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో పర్యటించి వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. అధినేతకు నియోజకవర్గాల సమస్యలు వినిపించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకునేందుకు దాదాపు అందరు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఏమేమి అడగాలనేదానిపై కాగితాలు కూడా తయారుచేసుకున్నారు. కానీ చంద్రబాబు కనీసం నియోజకవర్గ సమస్యలు కూడా వినే ప్రయత్నం చేయకపోవడంతో గుర్రుగా ఉన్నారు. ఎంతసేపూ విశాఖను ముంబై చేస్తా..రింగ్‌రోడ్డు వంటి ప్రకటనలతో నిరాశకు గురయ్యారు.
నీరుగార్చేసిన బాబు
చంద్రబాబు తన పర్యటనలో ఎమ్మెల్యేలను దగ్గరకురాానిచ్చినా కేవలం పొడిపొడిగానే పలకరించడంతో అవాక్కయ్యారు. తమకంటే అధికారులకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తొలిరోజు పర్యటనలో‘పొలం పిలుస్తోంది’ పేరుతో చోడవరంలో నిర్వహించిన రైతు బహిరంగ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌రాజు నియోజకవర్గ సమస్యలను వేలాదిమంది మధ్య సీఎంకు వినిపించారు. సుమారు అరగంటపాటు ప్రసంగించి నియోజకవర్గం అభివృద్ధికి ఏమి కావాలో కోరారు. చంద్రబాబు ఏ ఒక్క దానికి స్పందించకపోవడం విశేషం.
ఇక శనివారంనాటి డ్వాక్రా సంఘాల నక్కపల్లి సదస్సులో స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక అధికారులు కావాలనే ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వలేదా అన్న విషయంపై టీడీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రోటోకాల్‌ప్రకారం ఈ సదస్సుకు ఎమ్మెల్యే అధ్యక్షత వహించాలి. ముఖ్య అతిథులను ఆమె వేదికపైకి ఆహ్వానించాలి. ఆమె మాట్లాడిన అనంతరం ప్రాధాన్యతా క్రమంలో మిగతావారు మాట్లాడాలి. చివరగా ముఖ్యఅతిథి ప్రసంగంతో సభ ముగించాలి. ఇవేవీ సదస్సులో కనిపించలేదు. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ది కూడా ఇదే పరిస్థితి. సీఎం ప్రసంగం ప్రారంభం కాకుండానే ఆయన నిష్ర్కమించారు.
ఇదిచూసి చాలామంది ఎమ్మెల్యేలు తాము ఏం అడిగినా ఇదే పరిస్థితి వస్తుందనే ఆలోచనతో వెనక్కు తగ్గారు. వాస్తవానికి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం పేరుతో ఏటా రూ.కోటివరకు నిధులొస్తాయి. తామిచ్చిన మామీలు కొంతలోకొంత వరకు నెరవేర్చుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇదో మార్గం. కాని బాబు సీఎం అయిన తర్వాత ఈ పథకాన్ని ఎత్తేసి ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు.
ప్రజాప్రతినిధులంతా సీఎంపైనే ఆధారపడేలా చేశారు. ఇప్పుడు ఆయన్ను కలిసి సమస్యలు వివరించినా కనీసం పట్టించుకోకపోవడంతో భవిష్యత్తు ఏమిటనే ఆలోచన దాదాపు అందరిలోనూ నెలకొంది. మరోవైపు మంత్రులు గంటా,అయ్యన్న ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను బేఖాతరు చేస్తున్నారు. అటు సీఎం ఖాతరు చేయక, ఇటు నిధులు రాక, మంత్రులూ పట్టించుకోక తమ పరిస్థితి ఏంటో అర్థంకాక మథనపడుతున్నారు.