చదువు‘కొనాల్సిందే’!   | Fees Increased In SK University Anantapur | Sakshi
Sakshi News home page

చదువు‘కొనాల్సిందే’!  

Published Fri, Feb 15 2019 9:12 AM | Last Updated on Fri, Feb 15 2019 9:12 AM

Fees Increased In SK University Anantapur - Sakshi

‘అనంత’.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లా.  రెక్కలు ముక్కలు చేసుకున్నా పొట్ట నిండటమే గగనం. అలాంటిది చదువు   ‘కొనాలంటే’ సాధ్యమయ్యేపనేనా? అయినా చాలా మంది తల్లిదండ్రులు తమలా కాకుండా పిల్లలను ప్రయోజకులను చేయాలని అప్పులు చేసి చదివిస్తున్నారు. ఇలాంటి వారికి చేయూతనివ్వాల్సిన ఎస్కేయూ యాజమాన్యం.. ఫీ‘జులుం’ ప్రదర్శిస్తోంది. ప్రైవేటు కళాశాలల ఒత్తిడితో డిగ్రీ ఫీజులను రెండింతలు పెంచేసింది. నిరుపేదలకు ‘డిగ్రీ’ విద్యనూ దూరం చేసింది. ప్రభుత్వం మాత్రం పెంచిన ఫీజుల మేరకు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుందా? ఇచ్చినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాని విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఎస్కేయూ అనంతపురం: ఎస్కేయూ.. ఇక్కడ నిబంధనలన్నీ హుష్‌కాకి.. ఎవరికిష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. నిబంధనలు తుంగలో తొక్కేస్తారు. ఎవరికో లాభం చేకూర్చేందుకు ఎందరినో ఇబ్బంది పెడతారు. తాజాగా డిగ్రీ ఫీజులు రెండింతలు పెంచి విద్యార్థులను కన్నీరు పెట్టిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేకుండానే ఏళ్లుగా కళాశాలలు నిర్వహిస్తున్నా... యాజమాన్యాలకు కనీసం నోటీసులు కూడా జారీ చేయని ఎస్కేయూ ఉన్నతాధికారులు...అదే ‘ప్రైవేటు’ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు. డిగ్రీ ఫీజును రెండింతలు పెంచేసి వారికి భారీగా లబ్ధి చేకూర్చారు.

రాయలసీమలో ఎక్కడాలేని విధంగా.. 
పొరుగునే ఉన్న రాయలసీమ వర్సిటీ, యోగి వేమన వర్సిటీలో డిగ్రీ కోర్సుకు గతేడాది ఫీజులనే ఖరారు చేశారు. బీఏ, బీకాం కోర్సులకు ఏడాదికి రూ.9 వేలు, బీఎస్సీకి రూ.11 వేలు మాత్రమేవసూలు చేస్తున్నారు. కానీ ఎస్కేయూలో మాత్రం ఫీజులు రెట్టింపు చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఉండే అనుబంధ డిగ్రీ కళాశాల స్థాయిలో ఎస్కేయూ అనుబంధ ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజులు ఖరారు చేశారు.

కళాశాలలకు నిబంధనలు పట్టవా? 
వర్సిటీకి అనుబంధ డిగ్రీ కళాశాల ఏర్పాటైతే... మొదటి 5 సంవత్సరాల వరకూ అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చనీ, ఆ తర్వాత సొంత భవనాల్లో కళాశాల నిర్వహించాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ జిల్లాలోని 20 శాతం కళాశాలలు ఏళ్లుగా అద్దెభవనాల్లోనే నడుస్తున్నా... ఎస్కేయూ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ‘ప్రైవేటు’ కళాశాలలకు నిబంధనలు సడలించిన ఎస్కేయూ యాజమాన్యం...విద్యార్థుల ఫీజుల దగ్గరి వచ్చే సరికి మాత్రం నిబంధనల పేరుతో రెట్టింపు చేసింది. దీంతో నిరుపేద విద్యార్థులకు డిగ్రీ చదువు భారంగా మారగా...ప్రైవేటు అనుబంధ డిగ్రీ కళాశాలలకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ఈ వ్యవహారంలో వర్సిటీలోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
 
అడ్డుగోలు నిర్ణయాలు 
డిగ్రీ కోర్సులో ట్యూషన్‌ ఫీజు, స్పెషల్‌ ఫీజులను ఒకే దఫా 10 శాతానికి మించి పెంచడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఏకంగా ఫీజులు రెట్టింపు చేశారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోల్చుకుని ఫీజులు పెంచాలని కళాశాలల అసోసియేషన్‌ చెప్పినట్లు.. ఎస్కేయూ ఉన్నతాధికారులు వెంటనే ఆమోదం తెలిపి .. అమలు చేసేశారు. ఫీజులు ఎంత పెంచినా రీయింబర్స్‌మెంట్‌ అందుతుందనే ఉద్దేశంతో పెంచేశారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాని విద్యార్థుల పరిస్థితి గురించి మాత్రం పట్టించుకోలేదు. బీటెక్‌ కోర్సు స్థాయిలో ఎస్కేయూ డిగ్రీ కోర్సులకు ఫీజులు నిర్ణయించినా...ఆ స్థాయిలో విద్యాప్రమాణాలు ఉన్నాయా..? కళాశాలల్లో మౌలిక సదుపాయాలున్నాయా..? అని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ముందస్తుగా వసూలు 
ఏటా డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య 60 వేలుగా ఉంటోంది. గతేడాది వరకు ఒక్కో విద్యార్థి ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు ఫీజును చెల్లించాలని ఎస్కేయూ నిర్ణయించింది. తాజా అకడమిక్‌ విద్యాసంవత్సరం (2018–19) నుంచి ఏడాదికి కోర్సు ఫీజు మొత్తాన్ని బీఏకు  రూ.9 వేల నుంచి రూ.15,840, బీకాంకు రూ. 18,720, బీఎస్సీకి రూ.11 వేల నుంచి రూ.18,720  పెంచారు. ఇంతటితో అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆగలేదు. రూ.18 వేలకు అదనంగా రూ.6 వేల మేర అడ్మిషన్‌ ఫీజును నిర్ధారించి ఏకంగా రూ.24 వేలు ఫీజును నిర్ణయించారు. ఈ మొత్తాన్ని అడ్మిషన్‌ ముందస్తుగా చెల్లించాలని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

‘రీయింబర్స్‌మెంట్‌’  నిబంధనలకు విరుద్ధం 
కుటుంబ ఆర్థిక పరిస్థితి విద్యార్థి ఉన్నత చదువులకు అవరోధం కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందస్తుగా ఫీజులు వసూలు చేయకూడదని జీఓ నంబర్‌–18ను జారీ చేశారు. అలా వ్యవహరిస్తే ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని అప్పట్లో హెచ్చరించారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఫీజులు పెంచేయడమే కాకుండా ప్రభుత్వం ఆ మేరకు ఫీజు రీయింబర్స్‌ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పూర్తి మొత్తంలో ఫీజులు కట్టించుకుంటున్నాయి. వాస్తవానికి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇదే తరహాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తున్నప్పటికీ, ముందస్తుగా నయాపైసా కూడా కట్టించుకోలేదు. కానీ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలను విస్మరిస్తున్నాయి.

రెండింతలు పెంచారు 
డిగ్రీ ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రెండింతలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచిన ఫీజుల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ముందస్తుగా ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని తెలిసినా కళాశాలల యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. వర్సిటీ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. –సుజాత, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement