విద్యా సంవత్సరానికి ముందే విషమ ‘పరీక్ష’ | fees reimbursement no Release arrears | Sakshi
Sakshi News home page

విద్యా సంవత్సరానికి ముందే విషమ ‘పరీక్ష’

Published Tue, Jun 10 2014 12:06 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

విద్యా సంవత్సరానికి ముందే విషమ ‘పరీక్ష’ - Sakshi

విద్యా సంవత్సరానికి ముందే విషమ ‘పరీక్ష’

సాక్షి, కాకినాడ :ఈ విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే విద్యార్థులకు విషమపరీక్ష ఎదురవుతోంది. ఒక పక్క ఫీజు రీ యింబర్సుమెంట్ బకాయిలు విడుదల కాక కళాశాల యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు, మరొకపక్క ఉపకార వేతనాలు, కనీసం మెస్‌చార్జీలు విడుదల కాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వారం పదిరోజుల్లో కళాశాలలు ప్రారంభం కానున్న తరుణంలోఏం చేయాలో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు దిక్కులు చూస్తున్నారు.జిల్లాలో ఫీజు రీ యింబర్సుమెంట్, ఉపకార వేతనాల కోసం విద్యార్థులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. 2013-14 విద్యాసంవత్సరం ముగిసినా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీ యింబర్సుమెంట్, ఉపకార వేతనాలు, మెస్ చార్జీలకు సంబంధించి రూ.93.24 కోట్ల బకాయిలు ప్రభుత్వంనుంచి రావాల్సి ఉంది.
 
 అధికారిక లెక్కల ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్‌లో ఫీజు రీ యింబర్సుమెంట్, ఉపకారవేతనాలు, మెస్ చార్జీల బకాయిలు రూ.1500 కోట్లకు పైగా ఉన్నాయి. లోటు బడ్జెట్‌తో ప్రారంభమవుతున్న కొత్త రాష్ర్టంలోవారం పదిరోజుల్లో 2014-15కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కొత్త సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో అరకొర నిధులు విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో వైపు ఫీజు బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయడమే కాక కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ‘ముందు మీరు చెల్లించండి. ప్రభుత్వం మంజూరు చేశాక మీరు కట్టిన మొత్తం వెనక్కు ఇస్తాం’ అంటూ తెగేసి చెబుతున్నాయి. ఫీజు రీ యింబర్సుమెంట్‌పై ఆధారపడిన విద్యార్థుల్లో ఎక్కువ మంది పేదవర్గాల వారే. వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
 ఎవరికెంత బకాయి..
 జిల్లాలో 2013-2014కు సంబంధించి ఎస్సీ, బీసీ, ఈబీసీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు మొత్తం రూ.93.24 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 3,400 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.13 కోట్లు బకాయిలు ఉండగా, అందులో ఫీజు రీ యింబర్సుమెంట్ కింద రూ.10 కోట్లు, మెస్ చార్జీల నిమిత్తం రూ.3 కోట్లు, 31వేల మంది బీసీ విద్యార్థులకు  ఫీజు రీ యింబర్సుమెంట్ కింద రూ.35 కోట్లు, మెస్ చార్జీల కింద రూ.14 కోట్లు, 19 వేల మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీ యింబర్స్‌మెంట్‌గా రూ.30 కోట్లు, 3 వేల మంది ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీ యింబర్స్‌మెంట్‌గా రూ.కోటి, 2 వేల మందికి పైగా మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు రూ.24 లక్షలు విడుదల కావాల్సి ఉంది. బకాయిలు సకాలంలో విడుదల కాకపోతే వారి చదువు వానాకాలం చదువుగా మారే దుస్థితి తప్పదు.
 
 తక్షణం విడుదల చేయాలి
 ఎస్సీ స్కాలర్ షిప్‌లు తక్షణం విడుదల చేసి మా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి. కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించమంటోంది. మరో పది రోజుల్లో కళశాలలు ప్రారంభం కానున్నాయి. నేటికీ పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదు.
 - ఎస్.శ్రీను, డిగ్రీ  ద్వితీయ సంవ త్సరం, కోటనందూరు
 
 ఉపకార వేతనమే ఆధారం..
 కాకినాడ అంబేద్కర్ హాస్టల్‌లో ఉంటూ ఉపకార వేతనంతో ఐడియల్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేటికీ స్కాలర్ షిప్ రాకపోవడంతో ముందుగా ఫీజు చెల్లించమని కళాశాల యాజమాన్యం అంటోంది. కానీ ఈ విషయంపై అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు.  
 - ఐ.దావీదు, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, రౌతులపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement