ఆడపిల్ల భారమా..?
Published Thu, Jan 2 2014 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
అమ్మగా ప్రేమ పంచే ఆమెకు జన్మనెత్తే అదృష్టం లేదా..? చెల్లిగా అనురాగం పంచే ఆడది కడుపులోనే కన్ను మూయాలా..? దేవతగా పూజలందుకుంటున్న స్త్రీ కన్న కూతురిగా మాత్రం పనికి రాదా..? జిల్లాపై దండెత్తుతున్న ప్రశ్నలివి. అవును తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే ఈ క్షీణత ఎక్కువగా కనిపిస్తోంది.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: ‘మా ఇంటిలో మహాలక్ష్మి పుట్టింది’ అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో వినిపించకుండాపోతున్నా యి. ఈ కాలంలో కూడా ఆడపిల్లలను చాలా మంది భారంగానే చూస్తున్నారు. తాజా గణాంకాలు ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి. వీటి ప్రకా రం జిల్లాలో సగటున వెయ్యి మంది పురుషులు ఉంటే ఆడ పిల్లల సంఖ్య మాత్రం 955కి పరిమితమైంది. 2011లో జిల్లాలో 1000 మంది పురుషులకు 961 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత తగ్గిపోయింది.
స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువు
ఆడ పిల్లలు భూమిపైకి రాకముందే కన్ను మూస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులైతే, స్కానింగ్ సెంటర్లు కూడా ఈ పాపంలో భాగస్వాములే. జిల్లాలో నమోదిత స్కానింగ్ సెంటర్లు 42 ఉన్నాయి. వీటిలో అధికశాతం సెంటర్లు ప్రభుత్వ వైద్యులకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి స్కానింగ్ సెంటర్‌ను ఎప్పుటికప్పడు సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు పరిశీలించాలి. కానీ ఈ పరిశీలనలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. కారణం అంతా ‘మనం మనం బరంపురం’ అన్నట్లు ప్రవర్తించడమే. స్కానింగ్ సెంటర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి స్కానింగ్ సెంటర్ల వైపు చాలా మంది అధికారులు కన్నెత్తి చూడడం లేదు. రెండు రోజులు క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ వైవీ అనురాధ కూడా ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏడాది కాలంలో ఒక్క స్కానింగ్ సెంటర్‌పై కూడా కేసు నమోదు చేయకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
ఇతర జిల్లాల కంటే...
ఇతర జిల్లాల కంటే మన జిల్లాలోనే ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. దీనికి అధికారుల ఉదాసీనతే కారణం. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఈ సంఖ్య మెరుగ్గా ఉంది. కరీంనగర్, ఖమ్మం, చిత్తూరు జిల్లాలో పురుషులు కంటే ఆడపిల్లలే అధికంగా ఉన్నారు.
చట్టం అమలవుతోందా..?
లింగ నిర్ధారణ వెల్లడించే వారిని శిక్షించే చట్టాలు కఠి నంగా ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదు. లింగ నిర్ధారణ వెల్లడిస్తే మూడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే ఐదేళ్ల జైలు, రూ.50వేలు జరిమానా విధిస్తారు. చట్టాలు కఠినంగానే కనిపిస్తున్నా అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయి. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది.
తనిఖీలు చేస్తున్నాం...
స్కానింగ్ సెంటర్లపై ఎప్పుటికప్పుడు సీనియర్ పబ్లిక్ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయిస్తున్నాం. నేను కూడ స్వయంగా తనిఖీలకు వెళుతున్నాం. లింగ నిర్ధారణ వెల్లడించినట్టు తెలిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం
- యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
Advertisement