అశోక్‌బాబు సమావేశంలో రభస | Fight in the Ashok Babu meeting | Sakshi
Sakshi News home page

అశోక్‌బాబు సమావేశంలో రభస

Published Mon, May 7 2018 3:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Fight in the Ashok Babu meeting - Sakshi

సాక్షి, బెంగళూరు/అమరావతి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్‌కు వేయాలని  సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్‌ఫీల్డ్‌ రోడ్డులోని ఒక హోటల్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్‌బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది.

తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే తాము ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి తమను విభజించవద్దని సూచించారు. చంద్రబాబు చెప్పినట్లు అశోక్‌బాబు ఇక్కడికొచ్చి వ్యవహరించడం సరికాదని చెప్పారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎన్నికలతో అశోక్‌బాబుకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు.

అశోక్‌బాబును నిలదీసేందుకు కొందరు తెలుగు సంఘాల వారు హోటల్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గొడవ మధ్యే అశోక్‌ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన బీజేపీని, మోదీనీ ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు.   

టీడీపీ ఏజెంటువా?.. విష్ణువర్దన్‌రెడ్డి ధ్వజం 
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుపై బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన బెంగళూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ నేతలకు మొహం చెల్లక అశోక్‌బాబు లాంటి దళారికి విమాన టిక్కెట్లు ఇచ్చి కర్ణాటకకు పంపించారని ఆరోపించారు.

అశోక్‌బాబు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నారో? ఎన్టీఆర్‌ ట్రస్టు నుంచి తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అశోక్‌బాబు కర్ణాటక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొనడం సర్వీసు రూల్స్‌కు పూర్తిగా విరుద్దమని.. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అశోక్‌బాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజు మరో ప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement