చీరాల: జన్మభూమి కార్యక్రమం చీరాలలో అపహాస్యమైంది. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన వేదిక కాస్తా..వీధి తగాదాకు నెలవైంది. తమ గోడు చెప్పుకుందామని వచ్చిన ప్రజలు రాజకీయ నేతల మధ్య జరిగిన ఘర్షణ చూసి..వీరా తమ తలరాత మార్చే నేతలంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రొటోకాల్ రేపిన వివాదంతో ఎమ్మెల్యే ఆమంచి, టీడీపీ ఇన్‌చార్జ్ పోతుల సునీతల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నేతలు, వారి అనుచరులు అధికారుల ముందే పరస్పరం దాడులకు దిగారు.
ఈ ఘటన మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కాలనీలో ఏర్పాటు చేశారు. సభలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో జీ సాంబశివరావు ప్రారంభించి వేదికపైకి సర్పంచ్ దుడ్డు రూపవతి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహశీల్దార్ బీ సత్యనారాయణలను పిలిచారు.
తర్వాత సర్పంచ్ రూపావతిని అధ్యక్షత వహించాలని ఎంపీడీవో కోరారు. అప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతుల సునీత వేదిక వద్ద ఉన్నారు. ఆమంచి వర్గీయులు ‘ఆమంచి జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ సర్పంచ్ రూపావతి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతుల సునీతను వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకున్నా..సునీతను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు.
కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాల్సిన ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ని వేదికపైకి పిలవడంపై తొలుత మాటల యుద్ధం నడవగా..చివరకు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలను పిలవడం ఏమిటని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అయితే సర్పంచ్ మాత్రం ‘నేనే గ్రామానికి పెద్ద. మా నేత వేదికపైకి వస్తే మీకేంటి’ అని అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
దీనికి ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ ఇది రాజకీయ కార్యక్రమం కాదని..ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆమంచి, పోతుల వర్గీయులు కుర్చీలు, కర్రలతో దాడులకు దిగారు. ఆమంచి వర్గీయులు కొందరు సర్పంచ్‌పై దాడి చేశారు. సునీత వర్గీయులు కూడా ఆమంచి వర్గీయులపై దాడులు చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుని, తోసుకున్నారు. ఆమంచి, సునీత మధ్య దూషణల పర్వం కొనసాగింది.
పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆగ్రహానికి గురైన సునీత విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమంచి వర్గీయురాలు అనుకొని చేయిచేసుకోవడంతో పాటుగా దుర్భాషలాడారు. టూటౌన్ సీఐ అబ్దుల్‌సుబాన్, ఎస్సై రాములు నాయక్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా కానిస్టేబుల్‌పై సునీత దాడిచేస్తున్నా నిలువరించలేకపోయారు. చివరకు సునీతను పోలీసులు పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు.
జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్యెల్యే పట్టుబట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఈనెల 10 తేదీకి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒన్‌టౌన్ సీఐ బీమానాయక్ సునీత, ఆమంచిలతో చర్చించి గ్రామ సభ నుంచి వెళ్లాలని సూచించగా ఇరువర్గాలు ఒకరి తరువాత ఒకరు సభాప్రాంగణం నుంచి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఘర్షణలో గ్రామసర్పంచ్ డి.రూపవతిపై ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు దాడిచేయడంతో గాయాలయ్యాయి. దీంతో సర్పంచ్‌ని వైద్యసేవల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
అక్కడ ఆమె పోలీసులకు ఫిర్యాదు చే శారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న ఘర్షణలో ఎమ్యెల్యే ఆమంచి సోదరుడు స్వాములు కూడా ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఏఎస్పీ వి.రామానాయక్ గ్రామాన్ని సందర్శించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సర్పంచ్ డి.రూపవతిని పరామర్శించి సంఘటన వివరాలు సేకరించారు.
చంద్రబాబు ఆదేశాలతోనే జన్మభూమిలో పాల్గొంటున్నాం: పోతుల సునీత
జన్మభూమి- మాఊరు కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకే జన్మభూమిలో పాల్గొన్నాం. కానీ ఎమ్యెల్యే ఆమంచి చేతకాని వ్యక్తిగా ప్రవర్తించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుని మా పార్టీ వారిపై దాడి చేయించారు. అధికారులను బెదిరించారు. ఇటువ ంటి వ్యక్తులకు భయపడేది లేదు. పోలీసులు సర్పంచ్‌పై దాడిచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి.
ఇది పార్టీ కార్యక్రమమా? - ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్
జన్మభూమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం. టీడీపీ సమావేశంలాగా సునీత వేదికపైకి రావడం సరికాదు. అధికారుల అలసత్వం, అవగాహనా లోపం వలనే ఇలా జరిగింది. శనివారం దేవినూతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ సునీతను వేదికపైకి ఆహ్వానించకుండా ఉండాల్సింది. ఇకపై ఆమె మరో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాల వేదికపైకి రాకుండా ఉండాలి. సర్పంచ్ రూపావతి జన్మభూమి కార్యక్రమాన్ని ఆటంకపరిచారు. జన్మభూమిలో పంచాయతీ అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నాం. మరలా ఇదే గ్రామంలో జన్మభూమిలో పాల్గొని అభివృద్ధికి చర్యలు చేపడతాను.
బాహాబాహీ
Published Mon, Oct 6 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement