నూజివీడు, న్యూస్‌లైన్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒంటరిగానైనా అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. పార్టీ పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక చిన్న గాంధీబొమ్మ సెంటర్‌లో గురువారం సమైక్య శంఖారావం సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గాను దేశంలోని అన్ని రాష్ట్రాలూ తిరిగి.. ఆయా రాష్ట్రాలలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించి మద్దతు కూడగట్టిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. లోక్‌సభలో కూడా సమైక్య వాణిని వినిపించిన ఏకైకవ్యక్తి జగనే అని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ కంపెనీ తప్ప ప్రజలెవ్వరూ తెలంగాణ కావాలని కోరడం లేదని తెలిపారు.
విభజన ప్రక్రియకు ఆ ఇద్దరే కారణం...
విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద జరపడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి సమైక్య ముసుగును తగిలించుకుని అన్ని రకాలుగా విభజన ప్రక్రియ జరగడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతమంటూ కొంతకాలం గడిపిన చంద్రబాబు, ప్రస్తుతం సమన్యాయం అంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. గత ఐదు నెలలుగా సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని చెప్పారు. మిగిలిన పార్టీల నాయకులు కూడా ఒకే తాటిపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగివస్తుందని తెలిపారు. తెలుగుజాతి విచ్ఛిన్నం అవుతున్నా నోరుమెదపకుండా మూలన కూర్చున్న చంద్రబాబు రాబోయే రోజులలో తెలుగుజాతి ద్రోహిగా మారడం ఖాయమన్నారు.
విభజనతో సీమాంధ్రకు తీరని అన్యాయం...
ఏఎంసీ మాజీ చైర్మన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రలో సాగునీటి కొరత, ఉద్యోగాల కొరతతో పాటు వైద్య సదుపాయాల దృష్ట్యా కూడా తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు నైజాన్ని చూసి ఊసరవెల్లే సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. నూజివీడు పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీతో కలసి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుడిమెళ్ల రామస్వామి అధ్యక్షత వహించగా, సీనియర్ నాయకులు పల్లెర్లమూడి అభినేష్, లాంప్రసాదరావు, షేక్ మస్తాన్, ఆగిరిపల్లి మాజీ ఎంపీపీ నెర్సు పుల్లారావు, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పిళ్లా చరణ్, మండల కన్వీనర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సమైక్యం కోసం అలుపెరగని పోరు
Published Fri, Dec 20 2013 2:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement