సాక్షి, నల్లగొండ: జిల్లాలోని పది పల్లెల్లో ‘పంచాయతీ’ సమరం మొదలు కానుంది. గతేడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్‌డ్ అభ్యర్థులు లేకపోవడంతో ఆరు పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. అంతేగాక మరో ముగ్గురు సర్పంచ్‌లు అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరో సర్పంచ్ రాజీనామా చేశారు. ఇలా ఖాళీలు ఏర్పడిన 8 మండలాల పరిధిలో పది పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు 13వార్డు సభ్యుల కోసం ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఎన్నికల సమయంలో కేటాయించిన రిజర్వేషన్లే వీటికి వర్తిస్తాయి.
షెడ్యూల్ ఇలా...
శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 8వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రా చేసుకునేందుకు గడువు. 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియ ముగియగానే అదేరోజు లెక్కింపు మొదలవుతుంది. తదుపరి ఫలితాన్ని వెల్లడిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.
ఎన్నికల నియమావళి అమలులోకి...
గ్రామపంచాయతీలు, ఆయా వార్డుల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇది వర్తిస్తుంది. కుల,మత ప్రచారాలు నిషేధం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేయకూడదు. హామీలు ఇవ్వకూడదు. దేవాలయాలు, పాఠ శాలల వద్ద సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదు. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
ఎన్నికలు ఇక్కడే...
గతంలో సర్పంచ్‌లగా ఎన్నికైన వారు మరణించడం వల్ల మర్రిగూడ మండలంలోని మేటిచందాపురం(జనరల్ మహిళ), నూతన్‌కల్ మండలంలోని లింగంపల్లి (బీసీ-మహిళ), తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లి (ఎస్సీ-మహిళ) పంచాయతీకి తిరిగి ఎన్నిక జరుగుతుంది. సర్పంచ్ రాజీనామా చేయడం వల్ల త్రిపురారం మండలం గజలాపురం (ఎస్టీ -జనరల్) స్థానానికి, రిజర్వుడు అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నిక ఆగిన బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ (ఎస్టీ-జనరల్), కాంచల్‌తండా (బీసీ - జనరల్), తుర్కపల్లి మండలం మోతిరాం తండా (బీసీ- జనరల్), మేళ్లచెరువు మండలం వజినేపల్లి (ఎస్టీ - మహిళ), పెద్దవూర మండలం పోతనూరు (ఎస్టీ - మహిళ), తెప్పలమడుగు (ఎస్టీ-మహిళ) పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గురువారం రిటర్నింగ్ అధికారులను ఆయా ఆర్డీఓలు నియమిస్తారు.
వీళ్లు అర్హులే...
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు లేని గ్రామపంచాయతీల్లో చాలామంది ఇటీవల ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు నెలరోజులపాటు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తాజా (ఈ నెల ఒకటి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వీరు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగవచ్చు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది.
ఉప సర్పంచ్ ఎన్నిక లేనట్టే..
ప్రస్తుతం జిల్లాలో 8 పంచాయతీలకు ఉప సర్పంచ్‌లు లేరు. 7 పంచాయతీల్లో కోరం ఏర్పడక ఉప సర్పంచ్ ఎన్నిక జరగలేదు. ఎన్నికకు మూడు దఫాలు సమయమిచ్చినా అది సాధ్య పడలేదు. మరో ఉప సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఎనిమిది ఉప సర్పంచ్ స్థానాల ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే, వీరి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడలేదు.
పల్లెల్లో పంచాయతీ పోరు
Published Thu, Jan 2 2014 3:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement