నింపు.. పంపు
ఇసుక దందాలను సహించను.. డ్వాక్రా మహిళలు తప్పా, ప్రైవేటు వ్యక్తులు ఇసుక తవ్వకాలు నిర్వహించరాదు.. మంత్రులు జిల్లాల్లో
జరుగుతున్న పరిస్థితులను పట్టించుకొండి.
- ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టీకరణ...
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు భిన్నంగా జిల్లాలో ఇసుక అక్రమరవాణా చోటుచేసుకుంటోంది. డ్వాక్రా గ్రూపుల మాటున కొందరు, ఇసుక డంప్‌ల వేలం ద్వారా ఇంకొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లాలో నిత్యం అరకోటికి పైగా అధికార పార్టీ నేతల జేబుల్లోకి చేరుతోంది. ప్రకృతి సంపదను దోచుకునేందుకు అధికారపార్టీ నేతలు కావడమే ఏకైక అర్హతగా కొందరికి పెట్టుబడి అవుతోంది. పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదుల ద్వారా ఇసుక అక్రమరవాణాకు అడ్డు అదుపు లేకుండా నిర్విరామంగా చేపడుతున్నారు.
వెఎస్సార్ జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు ఇసుక అక్రమరవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పెట్టుబడి లేని ఆదాయం కావడంతో విజృంభిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుకను అందుబాటులోకి తేవాలనే తలంపుతో డ్వాక్రా సంఘాలకు ఆ బాధ్యతలను అప్పగించారు. వారి మాటున కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలో టన్ను రూ.వెయ్యి తో వికయిస్తున్న నేతలు బెంగుళూరుకు కూడా తరలిస్తున్నారు. అక్కడ టన్ను రూ.2వేలు పలుకుతుండటంతో ఎక్కువగా అటువైపు మొగ్గుచూపెడుతున్నారు. నిత్యం వందకు పైగా లారీలు జిల్లా నుంచి తరలివెళ్తున్నా నిలువరించే నాధుడే కరువయ్యారు.
పెట్టుబడిలేని వ్యాపారం....
వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు కొందరు ఇసుకనే నమ్ముకొని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్‌లు ఇవ్వడం ఒక వరం అవుతుండగా ఇసుక డంప్‌లను వేలంలో విక్రయించి, ఆమాటున నదులను లూఠీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంలో విక్రయించి, ఉన్న డంప్‌లను అలానే ఉంచి, ఆపర్మిట్లతో ఇసుకను తరలిస్తున్నారు.
బెంగుళూరులో ఒక లారీ ఇసుక రూ.60వేలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు కొండాపురం, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి యధేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. చెన్నై పట్టణానికి రాజంపేట నుంచి తరలిస్తున్నారు. పెట్టుబడిలేని వ్యాపారం కావడంతో అవకాశం ఉన్నచోట, కండబలం ఉన్న నాయకులు ఇసుక అక్రమ ఆదాయం వైపు మొగ్గు చూపుతున్నారు.
పక్కాగా సహకరిస్తున్న యంత్రాంగం....
ఇసుక డంప్‌ను అధికారపార్టీ నేతలకు అనువైన ప్రాంతానికి చేర్చడం, అక్కడ డంప్ ఉన్నట్లు అధికారులకు తెలియజెప్పడం, ఆ డంప్‌ను వేలంలో దక్కించుకోవడాన్ని క్రమం తప్పకుండా కొందరు నాయకులు పాటిస్తున్నారు. వేలంలో దక్కించుకున్న పర్మిట్ల ఆధారంగా నదుల్లోంచి ఇసుకను తరలిస్తున్నారు. నకిలీ పర్మిట్లు సృష్టించి ఇవ్వడంలో రెవిన్యూ యంత్రాంగం సహ కరిస్తోంది.
జిల్లాలో ఇరువురు ఆర్డీఓలు సైతం అక్రమ పర్మిట్లు అందించడంలో సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇరువురు రెవిన్యూ కార్యదర్శులను సస్పెండ్ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం.. అవకాశం వచ్చినప్పుడన్నా నాలుగురాళ్లు పోగు వేసుకోకపోతే ఎలా అంటూ తెలుగుదేశం పార్టీ నేత ఒకరు అభిప్రాయపడటం గమనార్హం.