సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇసుక అక్రమ రవాణాను నిరోధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) ఏర్పాటు కానుంది. రాష్ట్ర సరిహద్దుల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, రాష్ట్రంలో సారా రూపంలో మద్యం తయారు కాకుండా, ఇసుక అక్రమాలను నిరోధించేలా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ కార్యరూపంలోకి రానుంది. ఇదే విషయమై మూడు రోజుల క్రితం ఎక్సైజ్ శాఖా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలతో సహా కీలక అధికారులు హాజరైన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని సూచించారు. దీనికి అవసరమైన రూపురేఖలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. దీనిపై సరైన ప్రణాళికను తీసుకురావాలని ఆదేశించారు. మళ్లీ శుక్రవారం అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మద్య నియంత్రణ దిశగా అడుగులు
► మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేయడానికి, రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయని సీఎం ప్రస్తావించారు.
► గత ప్రభుత్వంలో మద్య నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ లాంటి అంశాల్ని పూర్తిగా వదిలేశారని, పర్మిట్ రూమ్స్, బెల్టుషాపుల రూపంలో ఎక్కడపడితే అక్కడ మద్యాన్ని విక్రయించారని సీఎం గుర్తు చేశారు.
► తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 శాతం దుకాణాలను తగ్గించడమే కాకుండా ధరలను కూడా పెంచామన్నారు. గ్రామాల్లో దాదాపు 43 వేల బెల్టుషాపులను ఏరివేయడమే కాకుండా, 4,500 పర్మిట్ రూంలను పూర్తిగా ఎత్తివేశామన్నారు. ఈ చర్యలతో మద్య నియంత్రణ విషయంలో కీలక అడుగులు ముందుకేశామని చెప్పారు.
► తాజాగా మద్యం ధరలను 75 శాతం పెంచడమే కాకుండా.. మరో 13 శాతం దుకాణాలను తగ్గించడానికి నిర్ణయించామన్నారు. దీనివల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం మద్యం దుకాణాలను తొలగించినట్టు అవుతుందన్నారు.
► రానున్న రోజుల్లో మద్యం నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, దీనివల్ల ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా జరక్కూడదని చెప్పారు.
స్వతంత్ర వ్యవస్థకు తుదిరూపు
► సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు స్వతంత్ర వ్యవస్థకు తుది రూపు ఇచ్చారు. గతంలో ఎక్సైజ్ కమిషనర్ కింద డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్టు ఉండేది. మద్యం అక్రమ రవాణా, తయారీలను అడ్డుకోవడం దీని పని. అయితే గత ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహించడంతో ప్రొహిబిషన్ కార్యకలాపాలు పూర్తిగా మూలనపడ్డాయి.
► తాజా నిర్ణయం ప్రకారం ఎక్సైజ్ కమిషనర్ కింద ఉన్న డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్టు స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) పోస్టు వస్తుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది.
► ఎక్సైజ్ విభాగంలో ఉన్న సిబ్బందిలో కొద్ది మంది ఎక్సైజ్ కమిషనర్ విభాగం కిందకు వస్తారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్స్‌లు, స్టాకు, విక్రయాలు, ప్రొడక్షన్ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్ కమిషనర్ చూసుకుంటారు.
► ఎక్సైజ్ విభాగంలో మిగిలిన సీఐలు, ఎస్సైలు, మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. ఇసుక అక్రమాలను నిరోధించడం వీరి విధుల కిందకే వస్తుంది.
మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు
► అక్రమ రవాణాకు ఆస్కారం ఎక్కువగా ఉన్న రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కోసం ఐపీఎస్ స్థాయి అధికారులు ఉంటారు. వీరంతా కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్)కు రిపోర్టు చేస్తారు.
► కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్‌బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కింద జిల్లాల్లో ఏఎస్పీలు కూడా పని చేస్తారు. ఒక్కో ఏఎస్పీ కింద కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు సమన్వయం చేసుకుంటారు.
► ఈ కొత్త వ్యవస్థకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు కల్పించి గట్టిగా పనిచేసేలా చూడాలని, అప్పుడే ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరుతాయని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు.
రాష్ట్రంలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయో.. అదే మాదిరి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) పని చేయాలి. మద్యం అక్రమ తయారీ.. మద్యం, ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకోవడమే దీని ప్రధాన విధి.
Comments
Please login to add a commentAdd a comment