వేలి ముద్రల పెన్షన్ మాకొద్దు
కోడుమూరు : వేలి ముద్రలు తీసుకోక.. పెన్షన్ అందక రోజుల తరబడి ఆఫీసుల దగ్గర కూర్చోని విసుగుచెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టూ ముట్టారు. ఆగ్రహంతో ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడ్డారు.పెన్షన్‌దారులకు మద్దతుగా సీపీఐ మండల కార్యదర్శి క్రిష్ణ, ఏఐఎస్‌ఎఫ్ నేతలు శ్రీరాములుగౌడ్, శివశంకర్, వైఎస్సార్‌సీపీ నేతలు ఎల్లప్ప, బీమలింగన్న గౌడ్, రామకృష్ణారెడ్డి వచ్చి అధికారులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
దాదాపు నాలుగు గంటల సేపు ధర్నా చేస్తూ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నాళ్లు ఈ అవస్థలు పెడతారు తిండి నీళ్లు మానుకొని తిరుగుతున్నా కనికరంలేదా.. రోజుకో నిబంధన పెట్టి చంపుతారా.. ఈ వయసులో మాకిన్ని కష్టాలు పెడతారా అని వృద్ధులు అధికారులపై నిప్పులు చెరిగారు. వేలిముద్రలతో తీసుకునే పెన్షన్ మాకొద్దు పాత పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేలిముద్రలు తీసుకోవడం లేదని పెన్షన్లను తీసేస్తారా అంటూ పెన్షన్‌దారులు ప్రశ్నించారు. వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డుమీద కూర్చొని ఆందోళన చేశారు. ముసలి వయసులో వేళ్లు అరిగిపోయి, ముద్రలు తీసుకోవడం లేదు. దీనికి మేం బలి కావాలా అని వృద్ధులు ఎంపీడీవో సువర్ణలతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పెన్షన్‌దారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేవిధంగా చూస్తానని హమీ ఇచ్చారు. వేలిముద్రలు తీసుకోక పెన్షన్ల్ రానివారందరూ ఆఫీస్ దగ్గరకు రావాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత మిగతా వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.
సీఐ జోక్యంతో సద్దుమణిగిన సమస్య
పెన్షన్‌దారుల ఉద్యమం ఉధృతంగా మారడంతో సీఐ డేగల ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పెన్షన్‌దారులతో మాట్లాడారు. సమస్య ఎక్కడ ఉందో ఆ కార్యాలయం దగ్గర ఆందోళన చేయండి. రోడ్డుపై కూర్చొని ఆందోళన చే పట్టడం సరైనా చర్య కాదు. మీకు న్యాయం జరిగే వరకు సహకరిస్తానని హమీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం పెన్షన్ పంపిణీ దారులు, ఎంపీడీవో సువర్ణలత, ప్రత్యేకాధికారి సుధాక ర్‌తో చర్చించి పెన్షన్‌దారులకు న్యాయం జరిగే విధంగా అధికారులతో హామీ ఇప్పించారు.
నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ
సెంటర్‌లో సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు 10 పెన్షన్లు కూడా పంపిణీ కాలేదు. దీంతో మహిళలు ఆగ్రహం చెంది ఆందోళన చేపట్టారు.