బడుగుల గూళ్లు బుగ్గి | Fire accident in Amalapuram | Sakshi
Sakshi News home page

బడుగుల గూళ్లు బుగ్గి

Published Fri, Jun 13 2014 1:03 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

బడుగుల గూళ్లు బుగ్గి - Sakshi

బడుగుల గూళ్లు బుగ్గి

అమలాపురం రూరల్ :చెమటోడిస్తే తప్ప సాపాటుకు నోచని కష్టజీవుల బతుకుల్లో చిచ్చు రగిలింది. వారి కళ్ల నుంచి నీరు ధారలు కట్టినా కనికరించని అగ్నికీలలు.. వారి కష్టార్జితాన్ని బుగ్గి చేసి గానీ శాంతించలేదు. ఎండలో, వానలో, చలిలో తమను అక్కున చేర్చుకున్న ఇళ్లు.. కళ్లెదుటే తగలబడి, మొండిగోడలతో మిగలడాన్ని చూసిన వారి గుండెల్లో ఆరని దుఃఖాగ్ని జ్వలించింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు శివారు అంబేద్కర్‌నగర్‌లో గురువారం ఉదయం జరిగిన  ఘోర అగ్ని ప్రమాదంలో 44 ఇళ్లు దగ్ధమయ్యాయి. వీటిలో 37 పూరిళ్లు కాగా, మిగిలినవి పక్కా ఇళ్లు. ఈ ప్రమాదంలో 44 కుటుంబాలు వీధిపాలయ్యాయి. రూ.70 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఇళ్లు అంటుకున్న సమయంలో వేడిగాలులు వీచడం, రెండిళ్లలోని వంటగ్యాస్ సిలిండర్లు పేలటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ముత్తామత్తుల భేతాళస్వామి ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం అసలే వాతావరణం రగులుతుండగా.. ఈ అగ్నిప్రమాదంతో పేరూరు, పరిసర గ్రామాల్లో గాలి నిప్పులకొలిమి నుంచి వచ్చినట్టు మరింత వేడెక్కింది.  
 
 పేలిన వంటగ్యాస్ సిలిండర్లు
 కొబ్బరి తోటల మధ్యనున్న అంబేద్కర్ నగర్‌లో దాదాపు 300 కుటుంబాలు జీవిస్తుండగా అందరూ రోజు కూలీలే. ఉదయమే దాదాపు 100 కుటుంబాలకు చెందిన వారు కూలి పనులకు వెళ్లిపోయారు. మరికొందరు కాలనీకి కొంచెం దూరంలోని ఓ ఇంట జరుగుతున్న పెళ్లి విందుకు వెళ్లారు. కాలనీ అంతా దాదాపు ఖాళీగా ఉన్న 11 గంటల సమయంలో  భేతాళస్వామి ఇంటి నుంచి పొగలు, మంటలు వచ్చాయి. విందు జరుగుతున్న చోటి నుంచే వాటిని గమనించిన కాలనీవాసులు గుండెలు బాదుకుంటూ పరుగులు తీశారు. అప్పటికే అగ్నికీలలు అనేక ఇళ్లను చుట్టుముట్టాయి. పొలాల్లో పనులకు వెళ్లిన వారూ దూరం నుంచే అగ్నికీలలను గమనించి పరుగుపరుగున ఇళ్లకు వచ్చారు. కొందరు తమ ఇళ్లలోని కొన్ని వస్తువులను చేరువలోని కొబ్బరి తోటల్లోకి విసిరేశారు. ఇదే సమయంలో కాలిపోతున్న రెండిళ్లలో వంట గ్యాస్ సిలిండర్లు పెనుశబ్దంతో పేలటంతో భీతిల్లి చెల్లాచెదురయ్యారు. కొందరు తెగించి తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లను బయటకు తెచ్చి కొబ్బరితోటలోకి చేర్చారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది.  
 
 ప్రమాద తీవ్రతను పెంచిన పడమటి గాలి
 అసలే వడగాలులతో భగ్గుమంటున్న వాతావరణం అగ్నిప్రమాదంతో మరింత ఉగ్రరూపం దాల్చింది. అదే సమయంలో పడమటిగాలి జోరు కావడంతో అగ్నికీలలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వేగంగా వ్యాపించాయి. ప్రమాదాన్ని కళ్లారా చూసిన బాధితుల్లో కొందరు దిగ్భ్రాంతితో స్థాణువులయ్యారు. కొందరు వృద్ధులు, మహిళలు తీవ్రవేదనతో సొమ్మసిల్లిపోయారు. దక్కించుకున్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్న కొబ్బరి తోటల్లో.. నిస్సహాయంగా విలపిస్తున్న బాధితులను చూస్తే యుద్ధభూమిలా కనిపించింది.
 
 నీరు లేక పెరిగిన నష్టం
 ఇళ్లు అంటుకోగానే కొందరు సమాచారం అందించడంతో ఆర్డీఓ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డి అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేటల నుంచి, చమురు సంస్థలైన కెయిర్న్ ఎనర్జీ, గుజరాత్ పెట్రోలియం, ఓఎన్జీసీల నుంచి అగ్ని మాపక శకటాలను రప్పించారు. ఈ ఆరు శకటాల్లో ఉన్న నీటిని విరజిమ్మినా మంటలు అదుపులోకి రాలేదు. వాటిలో మళ్లీ నీరు నింపుదామంటే అక్కడ నీరు అందుబాటులో లేదు. దాంతో శకటాలను కొంతదూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకువెళ్లి నీటిని నింపుకొని వచ్చారు. ఈ వ్యవధిలో మంటలు విజృంభించి, నష్టం మరికొంత పెరిగింది. జిల్లా అగ్నిమాపకాధికారి ఉదయ్‌కుమార్, సహాయ అగ్నిమాపకాధికారి ప్రశాంతికుమార్  పరిస్థితిని సమీక్షించారు. అమలాపురం తహశీల్దారు నక్కా చిట్టిబాబు, డీఎల్‌పీఓ జె.వి.ఎస్.ఎస్.శర్మ, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ కె.జానకిరామయ్య, పేరూరు సర్పంచ్ పెచ్చెట్టి చంద్రమౌళి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
 
 బాధితులను ఆదుకుంటాం : ఉప ముఖ్యమంత్రి రాజప్ప
 పేరూరు అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. ఆయన, ఎంపీ పండుల రవీంద్రబాబు ఫోన్‌లో బాధితులతో మాట్లాడారు. కేబినెట్ సమావేశంలో ఉన్న రాజప్ప ప్రమాదవార్త తెలుసుకుని ఆర్డీఓ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డిలతో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల వివరాలను తెలుసుకున్నారు. జిల్లాకు వచ్చిన వెంటనే బాధితులను పరామర్శిస్తామని ఎంపీపీ అభ్యర్థి బొర్రా ఈశ్వరరావు, సర్పంచ్ చంద్రమౌళిలకు చెప్పారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బాధితులను ఫోన్,లో పరామర్శించారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement