కొత్తూరు: పారాపురం ఏబీ రోడ్డుకు అనుకొని ఉన్న ఎస్సీ వీధిలో వృద్ధురాలు రీసి శాంతమ్మ చిన్న పూరింట్లో నివాసం ఉంటుంది. చలి నుంచి రక్షణ కోసం కుంపట్లో నిప్పు రవ్వలు వేసుకొని శుక్రవారం రాత్రి నిద్రించారు. అయితే అర్ధరాత్రి తరువాత నిప్పు రవ్వల నుంచి వ్యాపించిన మంటలు ఆమె మంచానికి, ఇంటికి వ్యాపించాయి. దీంతో ఆమె మంచంపైనే సజీవ దహనమైంది. శాంతమ్మ ఇంటితోపాటు పక్కన ఉన్న మరో నాలుగు ఇళ్లు కూడా ఈ ఘటనలో కాలిపోయాయి. గాఢ నిద్రలో ఉన్నవారంతా మంటల వేడికి మేల్కొని ఏం జరుగుతుందో తెలియక భయంతో పిల్లాపాలను తీసుకొని ఆరుబయటకు పరుగులు తీశారు. కళ్లెదుటే ఇళ్లు కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.
ఈ ఘటనలో తూత సుందరరావు, వీరయ్య, కొర్ర రవి, ఏకాశిలకు చెందిన ఇళ్లు బూడిదయ్యాయి. సుందరరావు గతంలో ఓ వ్యక్తి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పు చేశారు. దాన్ని తీర్చేందుకు మరో వ్యక్తి వద్ద రెండు రోజుల క్రితం మూడు లక్షల రూపాయలను అప్పుగా తెచ్చి బీరువాలో పెట్టగా.. ప్రమాదంలో ఆ డబ్బులతో పాటు 5 తులాల బంగారం కాలిపోయాయి. కొర్ర రవికి చెందిన లక్షల రూపాయలు, 5 తులాల బంగారు వస్తువులు కూడా బూడిదయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చిన మంటలను అదుపు చేశారు. రూ. 20 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
సంఘటన స్థలం వద్దే పోస్టుమార్టం
సజీవ దహనమైన శాంతమ్మ ఎములు మాత్రమే మిగిలాయి. దీంతో పాలకొండ ఏరియా ఆస్పత్రి వైద్యుడు విశ్వేశ్వరరావు ప్రమాద స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. కొత్తూరు ఇన్‌చార్జి ఎస్సై రాము కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ కాంతారావు తెలిపారు.
సంబరం జరుపుకున్న కొన్ని గంటల్లోనే...
తూత సుందరరావు ఇంట్లో శుక్రవారం రాత్రి వరకు జామి ఎల్లారమ్మ పండుగ జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో సందడిగా జరుపుకున్నారు. తరువాత అంతా నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ఇల్లు కాలిపోయి..తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చింది.
బాధితులకు రెడ్డి శాంతి పరామర్శ
పారాపురం అగ్నిప్రమాద బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి శనివారం పరామర్శించారు. ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి కోరుతామని బాధితులకు హామీ ఇచ్చారు. ఆమె వెంట పార్టీ జిల్లా కార్యదర్శి రేగేటి కన్నయ్య స్వామి, మండల కార్యదర్శి ఎం.తిరుపతిరావు, నాయకులు వను ము లక్ష్మీనారాయణ, పిన్నింటి శేషగిరి నాగేశ్వరరావు, బూరాడ గోవిందరావు, కొల్ల కృష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment