ఆటపాక (కైకలూరు) : అనుకున్నంతా అయ్యింది.. ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో చేపలను ప్రజలు సోమవారం లూటీ చేశారు. దీంతో 2012 జూన్ సంఘటన పునరావృతమైంది. ఉదయం నుంచి ఆటపాక, కోమటిలంక గ్రామాలతో పాటు సమీప గ్రామ ప్రజలు వందలాదిగా వచ్చి అటవీశాఖ ఆధీనంలోని చెరువులో ఒక్కసారిగా దిగారు. అందినకాడికి చేపలను ఒడిసి పట్టుకుని పరారయ్యారు. యువకులు, వృద్ధులతో పాటు మహిళలు కూడా చెరువులో దిగి చేపల వేటలో పాల్గొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రం చెరువు 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు దిక్కుల నుంచి ఒక్కసారిగా చెరువులో దిగి సంచులతో బతికిన చేపలను యథేచ్ఛగా తీసుకెళ్లి విక్రయించారు.
కొందరు నాలుగు చేపలను తాళ్లు కట్టి ఈడ్చుకుంటు వెళ్లారు. ఒక్కో చేప రూ.700 నుంచి రూ.1000 పలికింది. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను నిలువరించడం అటవీ సిబ్బంది, పోలీసులకు వీలు పడలేదు. అటవీ శాఖ రేంజర్ పర్యావరణ కేంద్రంలో డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహిస్తుండగానే చేపల చోరీ జరగడం గమనార్హం. చేపల లూటీ పూర్తయిన తర్వాత కైకలూరు టౌన్ ఎస్సై షబ్బీర్ అహ్మద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికైనా చేపలను పట్టుకునే అవకాశం కల్పించాలని ఆటపాక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.
అటవీశాఖ అధికారుల హైడ్రామా...
అభయారణ్య పరిధిలోని పక్షుల కేంద్ర చెరువులో చేపలను పట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని డాంబికాలు పలికిన అటవీశాఖాధికారులు కళ్లెదుట అభయారణ్యంలో చేపలను తరలిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు మిన్నకున్నారు. అటవీశాఖ రేంజర్ ధన్‌రాజ్ ఈఈసీ కేంద్రం వద్ద ఆటపాక, జాన్‌పేటలకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఆటపాక గ్రామ పరిధిలో మొత్తం 96 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 44 పర్యావరణ అభివృద్ధి కమిటీ (ఈఈసీ) సభ్యులు కలిగినవే. డ్వాక్రా సంఘాలు, ఈఈసీ సంఘాలు బ్యాంకులో జాయింట్ అకౌంట్ తీసుకోవాలని, చెరువులో అడుగున ఉన్న చేపలను పట్టుకుని వచ్చిన మొత్తంలో సగం గ్రామాభివృద్ధికి, మిగిలిన సగం పక్షుల కేంద్ర అభివృద్ధికి ఉపయోగించాలని రేంజర్ వారికి సూచించారు. ప్రస్తుతం చెరువులో జరుగుతున్న లూటీని పోలీసుల సహకారంతో అడ్డుకుని చేపలు పట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ నిర్ణయం ముందే తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. చెరువులో ఇప్పటివరకు నీరు లేక చనిపోయినవి, గ్రామస్తులు తీసుకెళ్లినవి, ఇతరులు రాత్రివేళల్లో తరలించినవి కలిపి దాదాపు కోటి రూపాయల విలువైన చేపలు ఉంటాయని అంచనా. మిగిలినవి కూడా చాలా విలువే చేస్తాయని తెలుస్తోంది. ఇదిలావుంటే డ్వాక్రా మహిళా సంఘాలతో చెరువులో చేపలకు కేవ లం రూ.10 లక్షలు పాట జరిగిందనే వదంతులు వినిపిస్తున్నాయి.
బెదిరిన పక్షులు...
వందలాదిమంది ప్రజలు ఒక్కసారిగా చెరువులోకి దిగడంతో ఆటపాక పక్షుల కేంద్రంలోని పెలికాన్, పెయింటెడ్ స్టాక్ పక్షులు పరారయ్యాయి. బెదిరి వెళ్లిన పక్షులు తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆటపాక పక్షుల కేంద్రం పక్షులు లేక కళావిహీనంగా మారింది.