ఫైల్ ఫోటో
సాక్షి, నెల్లూరు: కర్ణాటకలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దాదాపుగా 1,700 మంది జాలర్లను ఎట్టకేలకు జిల్లాకు తీసుకుని వస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వీరందరూ కర్ణాటక సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లారని, కరోనా వైరస్ ప్రబలుతుండడంతో లాక్‌డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. వీరు సొంత జిల్లాలకు రావాలని చూసినా ఆంక్షల కారణంగా అక్కడి అధికారులు కర్ణాటక సరిహద్దులోని క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు రాష్ట్ర మంత్రి పి అనిల్‌కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. (లాక్‌డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్న క్రీడాకారిణి)
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎంఓ అధికారులు మంత్రి అనిల్ మాట్లాడారు. కాగా అక్కడి కర్ణాటక అధికారులతో కూడా చర్చించి ఎట్టకేలకు సరిహద్దులో ఉన్న జాలర్లను జిల్లాకు తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరిని గూడూరులోని ఆదిశంకర కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వారిని ప్రత్యేక వాహనంలో తీసుకువస్తున్నారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మంత్రి పి అనిల్‌కుమార్, ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు చొరవతో జాలరర్లు జిల్లాకు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్వారంటైన్‌కు పెరిగిన బాధితులు – ఒక్కసారిగా 73 మంది తరలింపు
నెల్లూరు(అర్బన్): తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ జిల్లా అధికారులతో పాటు నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మత పరమైన కార్యక్రమానికి కొంత మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు, చీరాల ప్రాంతానికి చెందిన వారు ఒకే బోగీలో ఈ నెల 17న ప్రయాణించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వారు కూడా అదే బోగీలో ప్రయాణించడంతో అధికారులు లెక్కలు తీశారు. ఆ బోగీలో 300 మంది వరకు ప్రయాణించినట్టు గుర్తించారు. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. (లాక్‌డౌన్‌కు నై..)
ఇలా ఇప్పటికే నెల్లూరు డైకస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన 23 మందిని గుర్తించి ఆదివారం రాత్రి పెద్దాస్పత్రిలోని క్వారంటైన్ వార్డుకు తరలించారు. చీరాల ప్రాంతంలో మరో 40 మందిని గుర్తించిన అధికారులు వారిని కూడా కోవిడ్ రీజినల్ ఆస్పత్రిగా మార్చిన నెల్లూరుకే తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడంతో జిల్లాలో సంచలనంగా మారింది. కలెక్టర్ శేషగిరిబాబు, ట్రెయినీ కలెక్టర్ కల్పనాకుమారి, సీఐ నాగేశ్వరమ్మ, వైద్యాధికారులు వారిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వార్డుకు అల్లూరు ప్రాంతం నుంచి మరో అనుమానిత కేసు కూడా అర్ధరాత్రికి పెద్దాస్పత్రికి వచ్చింది.
అల్లూరులో...
అల్లూరు: ఈ నెలలో మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు అతను ప్రయాణించిన రైలుబోగీలోని ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అల్లూరు మండలం నుంచి ముగ్గురు వ్యక్తులు ఆ బోగీలోనే ప్రయాణించినట్టు వారికి తెలిసింది. ముగ్గురిలో ఒకరు మండలంలోని ఇస్కపల్లి కుర్రు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో ఇద్దరు అల్లూరు, నార్త్‌మోపూర్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. వీరిని నెల్లూరు పెద్దాస్ప త్రిలోని కరోనా వార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment