రహదారులు రక్తసిక్తం
Published Wed, Sep 11 2013 1:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
జిల్లాలో మంగళవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై లారీ, పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందులో ఒకరు హోంగార్డు కాగా ఇద్దరు లారీ డ్రైవర్లు ఉన్నారు. పెద్దశంకరంపేట మండలం జంబికుంట గేటు వద్ద ఆగి ఉన్న ఎడ్ల బండిని బైక్ ఢీకొన్న మరో సంఘటనలో ఒకరు మృతి చెందారు. బీడీఎల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో వృద్ధుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
చేగుంట, న్యూస్‌లైన్: ఏడో నంబర్ జాతీయ రహదారి రక్తమోడింది. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందులో ఒకరు హోంగార్డు కాగా ఇద్దరు లారీ డ్రైవర్లు ఉన్నారు. కాగా ఏఎస్‌ఐకి గాయాలయ్యాయి. తూప్రాన్‌కు చెందిన హైవే పెట్రోలింగ్ వాహనం ఉదయం 5 గంటల ప్రాంతంలో మాసాయిపేట వైపు వచ్చింది. అక్కడ దాబా వద్ద లారీలు ఆగి ఉండడంతో పెట్రోలింగ్ వాహనాన్ని ఆపిన హోంగార్డు వాహనం దిగాడు. లారీలను తీయాలంటూనే రోడ్డు దాటుతున్నాడు.
అటువైపు ఉన్న ఇద్దరు డ్రైవర్లు హోంగార్డు ఏదో చెబుతున్నాడని అతని వద్దకు వస్తుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ మొదట పెట్రోలింగ్ వ్యాన్‌ను ఢీకొని ఆ తరువాత వీరి ముగ్గురిని ఢీకొంది. దీంతో పెట్రోలింగ్ వ్యాన్ డ్రైవర్-కం-హోంగార్డు మహమ్మద్ సయీద్ (26) అక్కడికక్కడే మరణించాడు. ఇదే ఘటనలో హర్యానా ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్లు బల్వీందర్‌సింగ్(35), సందీప్‌సింగ్(22) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా పెట్రోలింగ్ వాహనంలోనే కూర్చున్న కౌడిపల్లి ఏఎస్‌ఐ మల్లేశంకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీరిని ఢీకొన్న లారీతో సదరు డ్రైవర్ పరారీ కాగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట ఎస్‌ఐ వినాయక్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మల్కాపూర్‌లో విషాదఛాయలు
కొండాపూర్, న్యూస్‌లైన్: వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు సయీద్ మరణించడంతో అతని స్వగ్రామమైన కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో సాయంత్రం ఖననం చేశా రు. ఏడేళ్ల క్రితం ఇతను పోలీసు శాఖ లో చేరాడు. తండ్రి పాషామియా 20 ఏళ్ల క్రితమే మరణించాడు. సయీద్‌కు ఇటీవలే పెళ్లి సంబంధం కుదరగా త్వ రలో పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామ సర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సా ర్ సీపీ జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మల్లేశం, పోలీసు సిబ్బంది తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Advertisement