అనంతపురం జిల్లాలో విషాదం
మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
విడపనకల్లు: అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు ఉరితాళ్లయ్యాయి. విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో ఒకే కుటుంబానికి చెంది న ఐదుగురిని బలితీసుకున్నాయి. గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన కుమ్మగంటి కురుబ రేవణ్ణ (65), అతడి పెద్ద కొడుకు ఎర్రిస్వామి (36), చిన్న కొడుకు బ్రహ్మయ్య (30), మనవడు రాజశేఖర్ (18 శుక్రవారం తమ సొంత పొలంలో విద్యుత్ బోరు మరమ్మతు చేయడానికి వెళ్లారు. సమీప బంధువు వరేంద్ర (29) కూడా వారికి సహాయంగా వెళ్లాడు. అందరూ కలిసి బోరులో ఉన్న ఇనుప పైపును పైకి తీస్తుండగా పట్టుతప్పింది.
ఇనుపపైపు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడింది. అంతే... హైఓల్టేజీ విద్యుత్ షాక్‌కు గురై వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. చుట్టుపక్కల పొలాల్లోని రైతులు ఈ విషయాన్ని గమనించి పరుగు పరుగున వచ్చినా ఫలితం లేకపోయింది. ప్రమాదం విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులకు చెప్పడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని విషాదంలో మునిగిపోయారు. మృతుల కుటుంబ సభ్యుల రోదన అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున సహాయం అందించే విషయంపై అధికారులతో మాట్లాడారు.
ఘటనపై జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లాలో విద్యు త్ షాకుకు ఐదుగురు మృతి చెందడం పట్ల వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ఐదుగురు మృతి చెందడం పట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో ఐదుగురి మృతి
Published Sat, Nov 29 2014 3:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement