టీడీపీకి షాక్‌ | five members joined in YSRCP | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్‌

Published Fri, Mar 3 2017 11:31 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీకి షాక్‌ - Sakshi

టీడీపీకి షాక్‌

 నెల్లూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో సునాయాసంగా విజయం సాధిస్తామనుకున్న తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ తగిలింది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుక,  వెంకటసుబ్బమ్మ (కొత్తూరు), కైలాసం సుప్రియ (ఇందుకూరుపేట బిట్‌–2)ఎంపీటీసీలు  గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ, మాజీ జెడ్‌పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌ కైలాసం వెంకటకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ లేబూరు వెంకురెడ్డి  కూడా  హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాయుడుపేట టీడీపీ కౌన్సిలర్‌ మచ్చా రమణమ్మ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.


తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇందుకూరు పేట మండలంలో కైలాసం ఆదిశేషారెడ్డి కుటుంబం పార్టీ కోసమే పనిచేస్తోంది. ఆదిశేషారెడ్డి గతంలో మండలపరిషత్‌ అధ్యక్షుడుగా, జెడ్‌పీటీసీగా ఎన్నికయ్యారు. మండలంలో ఈయనకు వ్యక్తిగతంగా పట్టుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో తన భార్య రేణుకతో పాటు మరికొంత మంది ఎంపీటీసీలను ఆయన గెలిపించుకోగలిగారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి అటు కైలాసం కుటుంబం టీడీపీతో అంటీముట్టనట్లు ఉంటోంది. ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత తీవ్రం కావడం, ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాడుతున్న తీరుకు కైలాసం ఆకర్షితులయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న అరాచకాలను నిరసిస్తూ వైఎస్‌ జగన్‌కు అండగా నిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.

రెండు రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను పసిగట్టిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వీరిని నిలువరించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీలోనే ఉండాలని వారి మీద అనేక రకాల్లో ఒత్తిడి చేయడంతో పాటు, పార్టీని వీడితే ఇబ్బందులు పడతారని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వీటిని లెక్క చేయకుండా ఆదిశేషారెడ్డితో పాటు భార్య రేణుక, ఇద్దరు ఎంపీటీసీలు, పలువురు టీడీపీ నేతలు గురువారం హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. జగన్‌ వీరందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి,  నల్లపురెడ్డి రజత్‌ కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి విజయం కోసం గట్టిగా పనిచేయాలని జగన్‌ వీరికి సూచించారు.
జగన్‌ పనితీరు చూసే పార్టీలోకి... ఎంపీపీ రేణుక
 ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని చూసే పార్టీలో చేరుతున్నామని మండల పరిషత్‌ అధ్యక్షురాలు కైలాసం రేణుక చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి తమ కుటుంబం మొత్తం కష్టపడుతుందని ఆమె తెలిపారు.
మేకపాటి సమక్షంలో నాయుడుపేట కౌన్సిలర్‌ చేరిక
తెలుగుదేశం పార్టీకి చెందిన  నాయుడుపేట 11వ వార్డు  కౌన్సిలర్‌ మచ్చా రమణమ్మ గురువారం సాయంత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరులోని తన ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కౌన్సిలర్‌ రమణమ్మకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌  షేక్‌ రఫీ, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement