చక్కని చదువుకు పంచ సూత్రాలు
- ప్రభుత్వ పాఠశాలల్లో అమలు
- 12న తెరుచుకోనున్న 3,350 పాఠశాలలు
- 5 నుంచి విజయభేరి యాత్ర
- ‘సాక్షి’తో డీఈవో దేవానందరెడ్డి మాటామంతీ
చక్కని చదువుల కోసం ఈసారి జిల్లాలో ఐదు సూత్రాలు అమలు చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో డీఈవోను ‘సాక్షి’ సోమవారం పలకరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పంచ సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు డీఈవో దేవానందరెడ్డి స్పష్టం చేశారు. కీలకమైన ఐదు అంశాలకు ప్రతి పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈవో), మండల విద్యాశాఖ అధికారి(ఎంఈవో) రోజుకు పదేసి పాఠశాలలు చొప్పున తనిఖీ చేసి తనకు రోజువారీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలలు తెరుస్తున్నందున అదేరోజు ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు అందినదీ లేనిదీ పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలలు తెరిచేసరికి ఆయా విద్యాలయాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థి పైతరగతికి ప్రమోట్ అయ్యాడా లేదా అనే విషయాన్ని పరిశీలించేలా జూన్ 12 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పర్యవేక్షణ తీసుకుంటామన్నారు. ఈ ఐదు అంశాల పరిశీలన సమయంలో సమయానికి ఉపాధ్యాయులు బడికి వస్తున్నారా? విద్యాబోధన ఎలా ఉంది? విద్యార్థుల హాజరు ఎలా ఉంది? తదితర అంశాలను కూడా ప్రత్యేకంగా పరిశీలన చేస్తామన్నారు. జిల్లాలో ఐదేళ్లు నిండిన బాలబాలికలు సుమారు 65 వేల మంది ఉన్నారని డీఈవో చెప్పారు. వారి వివరాలను ఎంఈవోలు, అంగన్‌వాడీలతో సేకరిస్తామన్నారు. వారిలో ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వస్తున్నారు...
జిల్లాలో ఈసారి కొత్తగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వచ్చే అవకాశం ఉందని, విద్యా వాలంటీర్ల నియామకం ఉండకపోవచ్చని డీఈవో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, ఇంకా సుమారు 1200 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 6, 7, 8 తరగతులకు పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ వంటి విభాగాల్లో పార్ట్‌టైం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరిపే విషయం పరిశీలనలో ఉందని తెలిపారు.
20.06 లక్షల పుస్తకాల పంపిణీ...
జిల్లాలో ఈసారి 20.06 లక్షల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్టు డీఈవో చెప్పారు. గతేడాది లక్ష పాఠ్యపుస్తకాలు మిగిలాయని, వాటికి తోడు 19.06 లక్షల పాఠ్యపుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న 7 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తిచేసినట్టు చెప్పారు. పాఠశాలలు తెరవగానే ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తామని తెలిపారు.
సిలబస్ మారడంతో ఈసారి బట్టీ పట్టే విధానం కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పద్ధతిలో విద్యాబోధన ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంగ్లిషు, తెలుగు, హిందీల్లో చదవడం, రాయడం, లెక్కల్లో బేసిక్స్ నేర్చుకోవడం వంటి పద్ధతులను అవలంబించడంలో ఉపాధ్యాయులే విద్యార్థులకు గైడ్‌గా ఉపయోగపడాలని తెలిపారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ పాఠశాలలు తెరిచేనాటికే సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల బోధనకు యాన్యువల్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉండాలని డీఈవో సూచించారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు డీఈవో చెప్పారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు. జిల్లాలో ప్రతి పాఠశాలలోను బాలికలకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. సుమారు 20 పాఠశాలలకు స్థల సమస్య కారణంగా సొంత భవనాలు లేవన్నారు. జిల్లాలో 800 బడులకు ప్రహరీ గోడలు లేవని, పట్టణ ప్రాంతాల్లోని 300 పాఠశాలలకు ఆట స్థలాల కొరత ఉందని తెలిపారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు.
200 హైస్కూళ్ల పరిధిలో విజయభేరి...
జిల్లాలో ఈ నెల 5 నుంచి 15 వరకు విజయభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డీఈవో చెప్పారు. పదోతరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సన్మానిస్తామన్నారు. ప్రత్యేకంగా ప్రచారం రథం ఏర్పాటు చేసి పది రోజులపాటు జిల్లాలోని సుమారు 200 ఉన్నత పాఠశాలల పరిధిలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ఉత్తీర్ణత శాతాలు, విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రచార రథం వెళ్లే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించి పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా బోధనపై సమాచారాన్ని తెలుసుకుని లోపాలు చక్కదిద్దుతామన్నారు. విద్య గొప్పతనాన్ని వివరిస్తూ మానవహారాలు, ర్యాలీలు చేపడతామని డీఈవో వివరించారు.