దేశ రాజధాని కంటే ఐదింతలు!
♦ 217 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణం
♦ దేశ పరిపాలన నగర విస్తీర్ణం 42.7 చ.కి.మీ. మాత్రమే
♦ అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదనలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం దేశ రాజధాని న్యూఢిల్లీ కంటే ఐదింతలు ఎక్కువ. దేశ పరిపాలన నగరమైన కొత్తఢిల్లీ 42.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే అమరావతిని 217 చ.కి.మీ, విస్తీర్ణంలో నిర్మించాలని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీకి సమీపంలోని ప్రాంతాలను అభివృద్ధి చేసి దేశ రాజధానిపై ఒత్తిడి తగ్గించినట్లే ఏపీ రాజధానిలోనూ సమాంతరంగా కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచాలని మాస్టర్‌ప్లాన్‌లో సూచించారు. దీంతోపాటు అమరావతిని ఎకనమిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయని ముసాయిదాలో ప్రస్తావించారు.
ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోని ప్రముఖ పరిశ్రమలు, వాటి అనుబంధ పరిశ్రమలను అమరావతిలో స్థాపించేందుకు అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అమరావతికి ముంపు వాటిల్లకుండా ముంపు ప్రాంతాలను గుర్తించి వాటిని ఎత్తుగా నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవడానికి వీలుగా రాజధాని ప్రాంతానికి సమీపంలో జలాశయాలు నిర్మిం చాలని ముసాయిదాలో ప్రతిపాదించారు.
సమాంతర ప్రాంతాల అభివృద్ధి..
ఢిల్లీకి చేరువలోని నోయిడా, గుర్గావ్‌ల తరహాలోనే అమరావతి నగరానికి చేరువలో మంగళగిరి, విజయవాడ, గన్నవరం ప్రాంతాలను రాజధానికి సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. అమరావతితోపాటు విజయవాడ 62.17 చ.కి.మీ, మంగళగిరి 4.29 చ.కి.మీ, గన్నవరం విమానాశ్రయం కలిపి 4.29 చ.కి.మీ., అభివృద్ధి చేయాల్సిందిగా మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించారు. అమరావతిలో నిర్మించనున్న నవ నగరాలకు వివిధ దేశాల్లో స్ఫూర్తిగా తీసుకున్న నగరాలను మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు.
సింగపూర్ తరహా పారిశ్రామికీకరణ
అమరావతిలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా ఉద్యోగాలు, కంపెనీలు వస్తాయని ప్లాన్‌లో వివరించారు. ఇందుకోసం రాజధాని నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలతోపాటు మౌళిక వసతులు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాలు అందించనున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ)ను స్థాపించేలా మల్టీ నేషనల్ కంపెనీలను అమరావతికి తీసుకు రావాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి సింగపూర్ తరహా పారిశ్రామిక విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఎకనమిక్ డెవలెప్‌మెంట్ బోర్డు(ఈడీబీ) ద్వారా పారిశ్రామిక విధానాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. బిజినెస్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, లాజిస్టిక్ జోన్‌లుగా విభజించి అభివృద్ది చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ జోన్‌లకు సమీపంలో గాలి, నీరు కాలుష్య రహిత పచ్చదనంతో నిండిన పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తారు. సింగపూర్‌లో ఏ విధంగా పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందిందీ మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించారు. రాజధానిలో విశాలమైన ఇంటర్నల్‌రోడ్డు నిర్మాణం జరుగుతుందని మాస్టర్‌ప్లాన్‌లో వివరించారు.
కృష్ణా నదికి కొత్త కరకట్ట
అమరావతి ప్రాంతానికి ముంపు ముప్పు రాకుండా మాస్టర్‌ప్లాన్‌లో ముందస్తు జాగ్రత్తలు సూచించారు. చెన్నై వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కృష్ణా నది, కొండవీటివాగు వల్ల అమరావతికి వచ్చే వరద ముప్పును ముందుగానే తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ తరచూ ముంపు బారిన పడే ప్రాంతాలను గుర్తించి అవి ఎత్తుగా ఉండేలా చూడాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. కృష్ణా నది వెంబడి ప్రస్తుతం 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఒక కరకట్ట ఉంది. దీనికి బదులు నదికి దగ్గర్లో కొత్తగా మరో కరకట్ట నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించారు.