బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి బస్సు ఎక్కించి ఎత్తుకుపోయిన ఘటన రాజమండ్రిలో
రాజమండ్రి క్రైం : బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి బస్సు ఎక్కించి ఎత్తుకుపోయిన ఘటన రాజమండ్రిలో మంగళవారం రాత్రి జరిగింది. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదెమ్మదిబ్బ సమీపంలోని కృష్ణానగర్‌కు చెందిన కోరుకొండ సత్యవతి, రాజులకు హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. రాజు పెయింటింగ్ పని చేస్తుండగా... కంబాలచెరువు సమీపంలోని చిరంజీవి బస్టాండ్ పార్కు సమీపంలో సత్యవతి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. సత్యవతి తనతోపాటు హేమంత్‌ను కూడా కిళ్లీ కొట్టు వద్దకు తీసుకువచ్చింది.
బయట ఆడుకుంటుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హేమంత్‌తో ఆడుకున్నాడని, కొద్ది సేపటి తరువాత చూస్తే సదరు వ్యక్తితోపాటు తన కుమారుడు హేమంత్ కూడా కనిపించకుండా పోయాడని సత్యవతి, రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు. కోరుకొండ వైపునకు వెళ్లే బస్సు ఎక్కించుకుని పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు కోరుకొండ, గోకవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ధవళేశ్వరం, రాజానరం, కడియం బొమ్మూరు పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు. ఇదిలా ఉంటే తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో సత్యవతి, రాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.