
లబ్బీపేట(విజయవాడ తూర్పు): చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ‘ఐదు కోట్ల ఆంధ్రులారా ఆలోచించండి’ అంటూ గురువారం విజయవాడలో వెలిసిన ఓ బ్యానర్ కలకలం సృష్టించింది. నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. బ్యానర్‌లోని అంశాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండటంతో.. మార్నింగ్ వాక్‌కు వచ్చిన పలువురు దీనిపై చర్చించుకోవడం కనపించింది. మరికొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. స్టేడియంలో సీఎం చంద్రబాబు సభ ఉండటంతో.. ఏర్పాట్లు పరిశీలించేందుకు అక్కడకు వచ్చిన అధికారులు ఈ బ్యానర్‌ను చూసి ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి దానిని తొలగించారు.
ప్రజలకు తెలుసులే!
యూ టర్న్ తీసుకుని ప్రత్యేక హోదానే కావాలని అడగడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలుసంటూ చంద్రబాబును ఉద్దేశించి బ్యానర్‌లో పేర్కొన్నారు. రాజధాని భూ కేటాయింపులతో పాటు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా అని ప్రశ్నించారు. వీటిపై సీబీఐ విచారణ కోరదామా? తెలుగుదేశం తమ్ముళ్లూ.. అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టింది కూడా మీరే కదా తమ్ముళ్లూ అని నిలదీశారు. వీటిపై ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.