=ఫ్లోరా పాఠశాల హాస్టల్‌లో ఘటన
=వాంతులు, విరోచనాలతో తల్లడిల్లిన విద్యార్థులు
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : అంగలూరు ఘటన జరిగిన మరుసటిరోజే హాస్టళ్లలో నిర్వాకం మరోసారి వెలుగుచూసింది. ఈసారి ఇది ప్రైవేటు పాఠశాల కావడం గమనార్హం. ఉయ్యూరులోని ఫ్లోరా పాఠశాల హాస్టల్ విద్యార్థులు కలుషితాహారం గురువారం అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో 200 మంది విద్యార్థులు ఉండగా 150 మంది వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో తల్లడిల్లిపోయారు. హాస్టల్ వార్డెన్ యాజమాన్యానికి సమాచారం అందించటంతో ఘటన వెలుగు చూడకుండా రహస్యంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
పట్టణంలోని మసీదు సెంటర్‌లో, కాటూరు రోడ్డులోని పిల్లల ప్రవేట్ వైద్యశాలల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వీరికి చికిత్స చేయిస్తూ పాఠశాల వాహనాల్లో తరలించేస్తూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండగా ఈ విషయం వెలుగుచూసింది. ఆస్పత్రికి చేరుకున్న విలేకర్లతో యాజమాన్యం నీరు కలుషితమవడం వల్ల జ్వరాలు వచ్చాయని నమ్మబలికే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న తహశీల్దార్ మహేశ్వరరావు విద్యార్థుల పరిస్థితి ఆరా తీసి వారినుంచి వివరాలు సేకరించారు. ఉప్మా, పులిహోర, చికెన్, మజ్జిగ ఆహారంగా తీసుకున్నామని వారు వివరించారు. ఆ తర్వాత విరోచనాలు అయ్యాయని, ఆ తర్వాత వాంతులు, జ్వరం వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో తహశీల్దార్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ శివరామకృష్ణతో చర్చించగా పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వివరించారు. అనంతరం పాఠశాల హాస్టల్‌లో ఉన్న అస్వస్థతకు గురైన విద్యార్థులను తహశీల్దార్ మహేశ్వరరావు, పట్టణ ఎస్సై శివప్రసాద్‌లు పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ శ్యామలాదేవిని వివరణ కోరారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
తీవ్ర జ్వరంతో.. ఒకే బెడ్‌పై...
ఆస్పత్రుల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా కనిపించింది. 103, 104 డిగ్రీల జ్వరంతో గజగజ వణుకుతూ ఒకే బెడ్‌పై ఇరుక్కుని పడుకుని మరీ చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గుైరె న విషయాన్ని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు రాత్రి 8.30 గంటలైనా తెలియజేయలేదు. తహశీల్దార్ విచారణలో ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా వార్డెన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా.. తల్లిదండ్రులకు చెప్పామంటూ తప్పడు సమాచారం చెబుతావా.. అరెస్ట్ చేయిస్తా ఏమనుకుంటున్నావో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించి రావాల్సిందిగా ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్‌లో సమాచారం అందించారు. విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకొని వారితో మాట్లాడించారు. ఏ భయం లేదు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. మరోపక్క విషయం వెలుగు చూడటంతో యాజమాన్యం ఆస్పత్రిలో విద్యార్థులను దొడ్డిదారిన తరలించేందుకు యత్నించింది. పాఠశాలకు చెందిన బస్సుల్లో మెల్లగా ఒక్కొక్కరిని హాస్టల్‌కు తరలించింది. ఉయ్యూరు పరిసర గ్రామాల విద్యార్థులను వారి ఇళ్లకు పంపినట్లు సమాచారం.
అందుబాటులో లేని అధికారులు...
మరోపక్క పలువురు అధికారులు పత్తా లేరు. కమిషనర్ బాలాజీ, పబ్లిక్ హెల్త్ ఏఈఈ కరుణాకరబాబు, విద్యాశాఖ అధికారులు రాత్రి 9.30 గంటలైనా ఘటనాస్థలికి చేరుకోలేదు.
కంటికి రెప్పలా కాపాడండి : సురేష్‌బాబు
సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆస్పత్రికి చేరుకొని విద్యార్ధులను పరామర్శించారు. అధికారులు, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల హాస్టల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించి కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు.