మంజూరైనా మోక్షం లేదు...
=మూడేళ్లయినా అమలుకు నోచుకోని పురా ప్రాజెక్ట్
=నేతల మాటలు నీటి మూటలే...
=విజయవాడలో ముందడుగు.. ఇక్కడ వెనకడుగు
=రూ.168 కోట్లు వదులుకున్నట్లేనా?
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పట్నంలోని సదుపాయాలు.. పల్లెల్లో చూడాలనుకున్న జిల్లా ప్రజల కల నెరవేరేటట్టు లేదు. అధికారుల అలసత్వం.. నేతల నిర్లక్ష్యం.. వెరసి కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపటాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్‌పె నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పుర’ (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం అమలు మూడేళ్లుగా జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
పేరు వినడమే తప్ప.. ఇక్కడి జనం ఆ పథకం అమలు తీరెలా ఉంటుందో ఎరుగరు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు వరంగల్ జిల్లాతోపాటు విజయవాడ కూడా ఎంపికైంది. అక్కడ పర్యాటక రంగానికి ఈ ప్రాజెక్టులో ప్రాధాన్యమివ్వడంతో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఏ విధంగా చూసినా విజయవాడలో ‘పుర’ అమలు తీరు మన జిల్లా కంటే చాలా రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. ఇందుకు కారణం అక్కడి ప్రజాప్రతినిధుల చొరవే.
రూ.168.52 కోట్ల ప్రాజెక్ట్
పుర ప్రాజెక్టు అమలుకు జిల్లాలో పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింతనెక్కొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూరు, పెద్దతండా గ్రామాలు ఎంపిక చేశారు. పథకం అమలు పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం యుగాంతర్, ఎస్‌వీఈసీ సంస్థలకు టెండర్ల ద్వారా అప్పగించారు. మొత్తం నిధులు రూ.168.52లో కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.123.34కోట్లు(73శాతం వాటా), రాష్ట్ర ప్రభుత్వం రూ.25.80 (15శాతం వాటా), భాగస్వామ్య సంస్థలు రూ.19.38కోట్లు(11శాతం వాటా) చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పదమూడేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వాహణ చేయాలి.
అందులో మొదటి మూడేళ్లు మౌలిక సదుపాయాల కల్పన చేపడతారు. తరువాత పదేళ్లపాటు నిర్వాహణ బాధ్యతలు చేట్టిన సంస్థలు పనుల పర్యవేక్షణ అమలు చూసుకుంటాయి. అనంతరం ఆ ప్రాంతంలోని స్థానిక సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం అప్పటికి పథకం ఫలాలు సామాన్యులకు అందుతాయి కాబట్టి దానిపై వచ్చే లాభాల నుంచి కొంత మొత్తం పన్నుల రూపంలో పంచాయతీల ఆమోదంతో వసూలు చేసి.. తదుపరి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలన్నది పథకం అసలు ప్రణాళిక.
పథకం అమలైతే...
వాస్తవ లెక్కల ప్రకారం జిల్లాలో ఈ పథకం ఇప్పటికే ప్రారంభమై మూడేళ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికీ అతీ..గతీ..లేకపోవడం మన నేతల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. గ్రామాల్లో కూడా మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, గ్రామాల్లో నిరంతరాయంగా సాగు, తాగునీరు, కూరగాయల పెంపకం, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు, పంటలు తరలించేందుకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి, విద్యుత్ దీపాలు, ఇంటర్‌నెట్ సదుపాయాలు కలుగుతాయి. పథకం అమలైతే పల్లెలు పట్నం రూపులోకి మారుతాయి. అయితే ఈ పథకంపై ఒకరిద్దరు ప్రజాప్రతినిధులకు తప్ప మిగతావారికి పెద్దగా అవగాహన లేనట్టు తెలుస్తున్నది.
ఆర్భాటాలే తప్ప.. ఆచరణ లేదు
కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆర్బాటాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో ముందడుగు పడడం లేదు. ఈ సంవత్సరం జూన్ 21న పథకం ప్రారంభించేందుకు రాష్ర్త ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో పాటు మొత్తం సుమారు 30 మంది వరకు ప్లామెంటు సభ్యులు వస్తున్నట్టు అధికారులు చెప్పారు. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, అప్పట్లో ముఖ్యంమంత్రికి వీలుకాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక అక్టోబర్11న జిల్లా మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ రాజయ్య, కలెక్టర్ ప్రత్యేకంగా పుర పథకం అమలుపై సమావేశం నిర్వహించుకున్నారు. త్వరలో ప్రతిపాదనలు ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు.
అంచనాలు పెరిగే అవకాశం
మూడేళ్ల క్రితం లెక్కల ప్రకారం పుర ప్రాజెక్టు అమలుకు రూ.168 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పటికీ ప్రారంభంకాని ప్రాజెక్టుకు అప్పటి అంచా వ్యయం సరిపోదు. ఈ లెక్కలు కేంద్రానికి పంపి ఆమో దం పొందినా లెక్కల్లో తేడాల వల్ల మొత్తంగా మరో 30 శాతం ఖర్చు పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కూడా సాంకేతిక పరంగా రాష్ట్ర స్థాయిలో ఆమోదం పొందే అవకాశం తక్కువని సమాచారం. ఈ విషయంలో నిపుణుల సూచనలు లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇప్పుడు కాకుంటే అంతే సంగతులు...
ప్రస్తుతం నేతలు పూనుకుంటే పథకం ఇప్పటికైనా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇక దీని గురించి ప్రజలు మర్చిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కొద్ది రోజుల్లో ఎన్నికల వాతావరణం కమ్ముకుంటుంది. ఈ తరువాత ఎన్నికల కోడ్... తరువాత కొత్త ప్రభుత్వం ఇలా... మళ్లీ మొదటికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాలయలు వచ్చే ఒక ప్రాజెక్టు విషయంలో మన నేతలు ఇప్పటికైనా చొరవ చూపితే కనీసం ప్రాజెక్టు ప్రారంభమైనట్టయినా ఉంటుంది.
పూరా నిర్లక్యం!
Published Sun, Nov 17 2013 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement