హోదా కోసం ఎందాకైనా.. | For status | Sakshi
Sakshi News home page

హోదా కోసం ఎందాకైనా..

Published Mon, Sep 21 2015 1:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

హోదా కోసం ఎందాకైనా.. - Sakshi

హోదా కోసం ఎందాకైనా..

పట్నంబజారు(గుంటూరు) : పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించినా భయపడే పరిస్థితి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. గుంటూరుఅమరావతి రోడ్డులోని బత్తిన కల్యాణమండపంలో ఆదివారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 26 నుంచి జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా 27వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారని తెలిపారు.

22, 23, 24 తేదీల్లో గ్రామ, మండల, పట్టణస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సూచించారు. స్వార్ధప్రయోజనం కోసం పాలన చేస్తున్న చంద్రబాబు సింగపూర్‌లో వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ దీక్షకు అన్ని వర్గాల మద్దతు కూడదీయాలని పిలుపునిచ్చారు.

 ప్యాకేజీల పాట సిగ్గుచేటు..
 ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హోదా కావాలని ప్రజలు కోరుతుంటే ప్రభుత్వం ప్యాకేజీల పాట పాడడం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రత్యేక హోదా రాదని బాహాటంగా చెబుతున్నారని, చంద్రబాబుకు కూడా ఈ విషయం తెలుసన్నారు. రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓటుకు కోట్లు వ్యవహారంతో చంద్రబాబునాయుడు ఎంత నిజాయితీపరుడో దేశ ప్రజలకు తెలిసిందని ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని గుర్తుపెట్టుకోవాలన్నారు.

బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ స్వయంగా సీఎం హోదాలో ఉన్న మనిషి ఇసుక దోపిడీని అరికట్టండని చెప్పడం సిగ్గుచేటన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమలో కాలువల నీళ్లు కలిపి నదులు అనుసంధానం చేశానని సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు మిన్నకుండిపోతున్నాడని విమర్శించారు.

 ప్రజల పక్షాన రాజీలేని పోరు..
 పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్ చేపట్టనున్న దీక్ష రాష్ట్ర దశ, దిశను మార్చనుందన్నారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో దీక్షకు ముందుగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆరేళ్లుగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం జననేత పోరాటబాట పట్టారని చెప్పారు. సీఈసీ సభ్యులు రావివెంకటరమణ మాట్లాడుతూ ప్రజల పక్షాన రాజీలేని పోరాటాలు చేస్తున్న ఏకైక నేత జగన్ అని కొనియాడారు. తెనాలి, తాడికొండ, వినుకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనిక్రిస్టినా, సురేష్‌కుమార్, బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడారు.

 పార్టీలో చేరిక..  సమావేశంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నన్నపనేని పూర్ణచంద్రరావు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సుబ్బారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పలు విభాగాల నేతలు మామిడి రాము, కావటి మనోహర్‌నాయుడు, పోలూరి వెంకటరెడ్డి, మొగిలి మధు, దేవళ్ళ రేవతి, కొత్తా చిన్నపరెడ్డి, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, కోవూరి సునీల్‌కుమార్, ఉత్తమరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, విజయలక్ష్మి, అంగడి శ్రీనివాసరావు, హనిమిరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, పల్లపు రాఘవ, శిఖా బెనర్జి, ఆవుల సుందరరెడ్డి, మండేపూడి పురుషోత్తం, దాది లక్ష్మీరాజ్యం, శానంపూడి రఘురామిరెడ్డి, జక్కింరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 దీక్షల సమావేశాలకు నియోజకవర్గాల పరిశీలకులు వీరే..
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి 22, 23, 24వ తేదీల్లో జరగనున్న మండలస్థాయి సమావేశాల నిర్వహణ కోసం నియోజకవర్గాల పరిశీలకులను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్  పార్టీ కార్యాలయంలో ఆదివారం వివరాలను వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గానికి పొందుర్తి గురవాచారి, గురజాల నియోజకవర్గానికి మర్రి వెంకటరామిరెడ్డి, వినుకొండ నియోజకవర్గానికి పిల్లి ఓబుల్‌రెడ్డి, చిలకలూరిపేటకు దేవళ్ల రేవతి, సత్తెనపల్లి నియోజకవర్గానికి కోవూరి సునీల్‌కుమార్, పెదకూరపాడుకు బసవ పూర్ణచంద్రరావు, నర్సారావుపేటకు సయ్యద్ మాబు, తాడికొండ నియోజకవర్గానికి బండారు సాయిబాబు, మంగళగిరి కొత్తా చిన్నపరెడ్డి, ప్రత్తిపాడుకు కావటి మనోహర్‌నాయుడు, పొన్నూరుకు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, బాపట్లకు డాక్టర్ రూత్‌రాణి, తెనాలికి కొలకలూరి కోటేశ్వరరావు, వేమూరుకు జలగం రామకృష్ణ, రేపల్లె నియోజకవర్గానికి చందోలు డేవిడ్‌రాజులు నియమితులయ్యారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూచించిన కార్యక్రమాల్లో పాల్గొని సమావేశాలు, సమీక్షలు నిర్వహించటంతో పాటు ప్రజలకు హోదా వలన ప్రయోజనాలు వివరించాలని తె లిపారు. ప్రజలను చైతన్య పరిచే భాధ్యతను పరిశీలకులు చూసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement