తీరప్రాంతానికి రక్షణ వలయంగా ఉన్న మడ అడవుల సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు
తీరప్రాంతానికి రక్షణ వలయంగా ఉన్న మడ అడవుల సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. సహజసిద్ధంగా ఏర్పడ్డ మడ అడవులను కొంతమంది స్వార్థపరులు విచక్షణారహితంగా నరికివేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అంతేకాక నరికిన చోట రొయ్యల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్ర హోరుకు, అలల తాకిడికి తీరప్రాంత భూభాగం దెబ్బతినకుండా రక్షణ కవచంగా ఉన్న మడ అడవులు తరిగిపోతుండటంతో తీరప్రాంత జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. తుపాను సమయాల్లో జరిగే విలయం ప్రభావాన్ని తగ్గించగలిగిన మడ అడవులు రోజురోజుకు తరిగిపోతుండటంతో తీరప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
రేపల్లె
గుంటూరు, కృష్ణా జిల్లాల తీరప్రాంతంలో పదివేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో మడ అడవులు సహజసిద్ధంగా విస్తరించి ఉండేవి.గుంటూరు జిల్లాలో సుమారు నాలుగు వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో సుమారు మూడు వంతులు మడ అడవులతో దట్టంగా అలుముకుని ఉండేవి. 1985 నుంచి తీరంలో రొయ్యల సాగు ప్రభావం పెరగటంతో మడ అడవులను విచక్షణారహిత ంగా నరికివేసి రొయ్యల సాగుకు చెరువులుగా మలిచారు.
అప్పట్లో టైగర్ రొయ్యలకు విదేశాల్లో మంచి గిరాకీ పెరగటంతో తీరప్రాంతాల ప్రజలు రొయ్యల సాగుపై మక్కువ చూపారు.
రేపల్లె మెయిన్, మీడియం డ్రెయిన్‌లు, పాలరేవు, బీఎం మెయిన్, మీడియం డ్రెయిన్‌లకు తీరం సమీపంలోని భూభాగాలను రొయ్యల సాగుగా మార్చటం ప్రారంభించారు.
అనతికాలంలోనే మడ అడవుల స్థానంలో రొయ్యల చెరువులు దర్శనమిచ్చాయి. ఈ ప్రభావంతో మడ అడవుల విస్తీర్ణం 2 వేల హెక్టార్‌లకు తగ్గిపోయింది.
2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ ప్రభావంతో మడ అడవుల ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి మడ అడవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ స్కీమ్ (ఏపీసీఎఫ్‌ఎం) కింద గ్రామాలలో ఎకోడవలప్‌మెంట్ కమిటీ (ఈడీసీ)ల ద్వారా అటవీ ప్రాంతంలో మడ అడవుల అభివృద్ధికి రూ. 4.50 కోట్లతో 700హెక్టార్‌లలో ఉన్న చెరువులను పూడ్చి మడ అడవుల పెంపకాన్ని నిర్వహించారు.
పెంపకాన్ని పూర్తి చేసిన అనంతరం వాటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది.
దీంతో వేసవిలో నీరు లేక మడ మొక్కలు చనిపోతున్నాయి. మడ మొక్కలను నరుకుతూ వంట చెరుకుగా ఉపయోగించటంతోపాటు , వివిధ అవసరాలకు ఉపయోగించటం వల్ల మడ అడవులకు తిరిగి నష్టం ఏర్పడుతున్నది.
ఇప్పటికైనా అధికారులు నిర ంతర పర్యవేక్షణతో పాటు మడ మొక్కలకు నీటిని అందించేందుకు అవసరమైన కాల్వలను పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డివి రమణారెడ్డి వివరణ
మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక నిధులు లేవు. గత వేసవిలో మడ మొక్కలకు పుష్కలంగా నీరు అందే విధంగా నిధులు కేటాయించి పనులు చేయటం జరిగింది. గతంలో తవ్విన చిన్న చిన్న కాల్వలు ప్రస్తుతం పూడిపోవటంతో వేసవిలో నీరు అందక మొక్కలు దెబ్బతింటున్నాయి.
ప్రస్తుతం ప్రత్యేక నిధులు ఏమీ లేవు. అటవీ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చోట్ల మడ మొక్కలకు నీరు అందించే విధంగా ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి అందించి మడ అడవుల అభివృద్ధికి మరింత చర్యలు చేపడ తాం.