‘అవినీతికి అనేక దారులు’ అన్నట్టుగా ఉంది ఆ అధికారుల తీరు. అవకాశం లేనిచోట కూడా వెతికి వెతికి మరీ ప్రత్నామ్నాయాలు కనిపెడుతున్నారు. జిల్లాలోని కొందరు అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అటవీ సంపద అంతగా లేకపోయినా ‘వాల్టా చట్టం’ పేరుతో వారు అక్రమాలకు పూనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుభాష్‌నగర్/వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ :
నిజామాబాద్ డివిజన్‌లో పెద్దగా అటవీ సంపద లేదు. ‘అదనపు ఆదాయం’ సమకూరే అవకాశాలు లేకపోవడంతో ఈ డివిజన్‌లో పనిచేయడానికి అక్రమార్కులు ఇష్టపడడం లేదు. ఇక్కడికి బదిలీ చేసినా.. వివిధ కారణాలతో బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా త్వరలోనే బదిలీ చేయించుకుని వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వివాదాస్పద అధికారి వచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి లక్షల్లో ‘అదనపు ఆదాయం’ పొందారు. ఆయన పాపం పండి, కొద్దిరోజుల క్రితం ఏసీబీ కి చిక్కారు.
ప్రత్యామ్యాయాలివి..
అక్రమార్జనకు అలవాటు పడిన అటవీ శాఖలోని అధికారులు కొందరు కలప ద్వారా వచ్చే అక్రమ సొమ్ముతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను వెతుక్కొన్నారు. అటవీ భూముల్లో జరుగుతున్న మొరం తవ్వకాలపై వారు దృష్టి సారించారు. అక్రమంగా మొరం తవ్వుతున్న వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటూ అమ్యామ్యాలు స్వీకరిస్తున్నారు. క్రషింగ్ మిషన్ల యజమానులనుంచీ అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. వాల్టా ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అక్రమార్కులు లంచాలు పుచ్చుకుంటూ వదిలేస్తున్నారు.
మొరం దందాతో..
నిజామాబాద్ రేంజ్ పరిధిలోని ధర్మపురి హిల్స్ సమీపంలో ఉన్న రిజర్వు ఫారెస్ట్‌లో సుమారు 16 ఎకరాల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ దందా కొనసాగుతోంది. ఇటీవల ఏసీబీకి చిక్కిన అధికారిని వీరే నిజామాబాద్‌కు తీసుకువచ్చారన్న ఆరోపణలున్నాయి. అలాగే అటవీ శాఖలో ఉన్నతాధికారి, ఓ బీట్ ఆఫీసర్ కూడా మామూళ్లకు అలవాటు పడి అక్రమ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు కలిసి నెలకు * 20 లక్షల వరకు అక్రమంగా సంపాదించేవారని సమాచారం. ఇటీవల ఏసీబీకి చిక్కిన అధికారి ప్రతి శనివారం రాత్రి హైదరాబాద్ వెళ్లేవారని, కనీసం * 3 లక్షల నుంచి * 4 లక్షల అక్రమార్జనను వెంట తీసుకెళ్లేవారని తెలుస్తోంది.
క్రషర్ల ద్వారా..
నిజామాబాద్ అటవీ డివిజన్‌లో ప్రధానంగా పది క్రషర్లున్నాయి. వీటి యజమానులు కూడా నెలనెల లక్షల రూపాయలు ముట్టజెప్పేవారని తెలుస్తోంది. ఆరోపణలు ఉన్న అధికారి నలుగురు క్రషింగ్ యజమానుల నుంచి * 24 లక్షలు లంచం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి మళ్లీమళ్లీ వేధిస్తుండడంతో వారు ఏసీబీని ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నారని సమచారం.
కాసులు కురిపిస్తున్న వాల్టా
వాల్టా చట్టం అటవీ శాఖలోని అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నిజామాబాద్ మీదుగా వివిధ ప్రాంతాల నుంచి రోజు బబుల్ (కలప) లారీలు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. వాటిని అటవీశాఖాధికారులు ఆపి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దొరికిన ఒక్కో లారీ యజమాని వద్ద నుంచి వాల్టా చట్టం పేరుతో *25 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఓ బీట్ ఆఫీసర్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ఇలా అటవీ శాఖలోని అక్రమార్కులు యథేచ్ఛ గా వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు.
అటవీ ప్రాంతంలో యథేచ్చగా అక్రమాలు
Published Fri, Sep 20 2013 2:32 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement