ఇష్టారాజ్యంగా నరికివేత
తీరంలో సగానికి పైగా పడిపోయిన విస్తీర్ణం
మేల్కొనకపోతే ముప్పే!
తీరప్రాంతానికి రక్షణ కవ చంగా ఉన్న మడ అడవులకు ఆక్రమణదారుల రూపంలో అవినీతి చీడ అంటుకుంది. రాజకీయ నేతల అండదండలతో వారు ఇష్టారాజ్యంగా అడవులను నరికేస్తున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలను చెరువులుగా మార్చేశారు. మడ అడవులు చెరువులుగామారిపోవడంతో తీరానికిపెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటి కైనా అధికారులుమేల్కోకపోతే అవి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కన బడుతోంది.
అవనిగడ్డ : జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో మడ అడవులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దివిసీమలోని నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఏడాది నుంచి ఆక్వా కల్చర్ లాభాలను తెచ్చిపెడుతుండడంతో మడ అడవుల్లో చెరువుల తవ్వకాలు జోరందుకున్నాయి. కొందరు స్వార్థపరులు వీటిని నరికి చెరువులుగా మార్చేస్తున్నారు. దీంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. 25 వేల ఎకరాలకు గాను ప్రస్తుతం పదివేల లోపే ఉన్నట్లు తెలుస్తోంది.
యథేచ్ఛగా నరికివేత
కొంతకాలంగా మచిలీపట్నం, దివిసీమ ప్రాంతంలో మడ అడవుల నరికివేత ఊపందుకుంది. చెరువులు తవ్వాలనుకున్నవారు ముందుగా కూలీలతో మడ అడవులను నరికివేయిస్తారు. సెలవు రోజులు చూసుకుని వాటిల్లో చెరువులు తవ్వేస్తారు. వారం రోజులుగా నాగాయలంక మండలంలోని గుల్లలమోద, నాలి, సొర్లగొంది ప్రాంతాల్లోని మడ అడవుల్లో చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా చేపడుతున్నా సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు.
కోతకు గురవుతున్న తీరం
మడ అడవుల నరికివేత వల్ల జిల్లాలోని తీర ప్రాంతం కోతకు గురవుతోంది. 2004లో సునామీ వచ్చిన సమయంలో కోడూరు మండలం పాలకాయతిప్ప వరకు గ్రామంలోకి సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. ఆ సమయంలో ఇంతగా మడ అడవుల నరికివేత లేదు. అప్పటినుంచి ఇప్పటివ కు సుమారు పదివేల ఎకరాలకుపైగా మడ అడవులను నరికివేసి చెరువులుగా మార్చేశారు. ఈ సారి సునామీ లాంటి ఉపద్రవం వస్తే తీరప్రాంతాలపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. మడ అడవులు హరించుకుపోవడం వల్ల తీరప్రాంత వాతావరణంలో పెను మార్పులు సంభవించాయని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల తీరప్రాంతంలో అరుదైన పక్షిజాతులు, జలచరాలు, పలు రకాల జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు అటవీశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
మొక్కలను పెరగనీయడం లేదు
గత ఏడాది తీర ప్రాంతంలో మడ అడవుల పెంపకానికి రూ.3 కోట్ల వరకు మంజూరు చేయగా కొన్ని ప్రాంతాల్లో పెంపకం పనులు చేపట్టారు. ఈ భూములపై కన్నేసిన కొంతమంది ఆక్రమణదారులు.. మడ అడవులు పెరిగితే చెరువుల తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతుందని భావించి వాటిని పెరగనీయకుండా చేస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖలో సిబ్బంది కొరత, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అటవీ భూముల్లో మడ అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
తవ్వకం వాస్తవమే...
మడ అడవుల్లో చెరువుల తవ్వకం మాట వాస్తవమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత జిల్లా అధికారి ఒకరు చెబుతున్నారు. మడ అడవులను నరికివేసి చెరువులు తవ్వేస్తున్న వైనంపై వివరణ కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. సిబ్బంది కొరత, రాజకీయ ఒత్తిళ్లు వల్ల ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.