దర్పల్లి/నిజామాబాద్,న్యూస్‌లైన్: ఓ అటవీ శాఖాధికారి దారుణ హత్యకు గురయ్యారు. మరో ఆరుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ భూములను కబ్జాదారులు దున్నుతున్నారనే సమాచారంతో అర్ధరాత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన్ను దుండ గులు కళ్లలో కారంచల్లి.. గొడ్డలితో నరికి చంపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం నల్లవెల్లి గ్రామపరిధిలో కొందరు అటవీ భూమిని కబ్జా చేసి, ట్రాక్టర్లతో దున్నుతున్నారనే సమాచారంతో శనివారం అర్ధరాత్రి ఇందల్వాయి అటవీ శాఖాధికారి గంగయ్య పదిమంది సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు.
ఘటనాస్థలానికి సమీపంలో జీపు పొలంగట్టు దగ్గర ఆగిపోయింది. సిబ్బంది కిందికి దిగి నెట్టేందుకు ప్రయత్నిస్తుండగా, అప్పటికే కాపుకాసి ఉన్న దుండగులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. గంగయ్య కంట్లో కారం చల్లారు. గొడ్డలితో నదుటిపై నరికారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ముగ్గురు బీట్‌ఆఫీసర్లు మక్బూల్, భూమయ్య, మోహన్‌లతో పాటు ముగ్గురు స్పెషల్ డ్యూటీ సిబ్బంది జోసెఫ్, రాజు, సురేందర్, జీపు డ్రైవర్ సయ్యద్ మొయినుద్దీన్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ కేవీ మోహన్‌రావు, అదనపు ముఖ్యఅటవీ సంరక్షణాధికారి (హైదరాబాద్) స్వర్గం శ్రీనివాస్, నిజామాబాద్ డీఎఫ్‌వో భీమానాయక్ సందర్శించారు.
నిందితులపై టాడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు. గంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకురాగా.. కుటుంబసభ్యులు, అటవీసిబ్బంది అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్, ఎస్పీలు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ దాడుల్లో మొత్తం 35 మంది వరకు ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు.