అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం దుంగల తరలింపు ఆగడం లేదు. ప్రతి రోజూ దుంగలు తరలిపోతూనే ఉన్నాయి. అక్కడడక్క మాత్రం కొందరు పట్టుబడుతున్నారు.
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం దుంగల తరలింపు ఆగడం లేదు. ప్రతి రోజూ దుంగలు తరలిపోతూనే ఉన్నాయి. అక్కడడక్క మాత్రం కొందరు పట్టుబడుతున్నారు. తాజాగా శుక్రవారం రైల్వేకోడూరు రూరల్ మండలం బాలుపల్లె, జ్యోతి కాలనీ సమీపంలో వచ్చిన లారీపై అనుమానమొచ్చిన అటవీ అధికారులు ఆపారు.
వీరిని చూడగానే లారీని ఆపి అందులోని దొంగలు పరారయ్యారు. లారీని పరిశీలించిన అధికారుల కంట 30 దుంగలు కంటపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు అవుతుందని రేంజర్ శ్రీరాములు తెలిపారు. ఎఫ్‌బీఓలు లింగారెడ్డి, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
సిద్దవటంలో...
గొల్లపల్లె బీట్‌లోని నిమ్మకాయలబండ అటవీ ప్రాంతం నుంచి 38 ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత దాడులు నిర్వహించిన అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోనే స్మగ్లర్లు దాగి ఉంటారన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టగా మైదుకూరు మండలం లక్ష్మీపల్లెకు చెందిన వెంకటకృష్ణయ్య అనే కూలీ దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సిద్దవటం రేంజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు.