
సాక్షి, అమరావతి: ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో పేర్కొన్నారు.
ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment