9393610113 నంబరు నుంచి మాజీ మంత్రి బెదిరింపులు ?
స్వతంత్రులకు మద్దతివ్వాలంటూ హుకుం
వ్యాపారుల నుంచి చందాలకు డిమాండ్ ?
పట్టణంలో కలకలం రేపిన వైనం
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం పెచ్చుమీరింది. వైఎస్సార్ సీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఆయా వార్డుల్లో అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న నాయకులను, కార్యకర్తలను, వ్యాపారులను మీ అంతు చూస్తామంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు వార్నింగ్‌లు ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. కృష్ణా జిల్ల ఉయ్యూరులో ఆరో వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగవీటి శ్రీనివాసప్రసాద్‌కు మద్దతుగా రజక సంఘ నాయకుడు, వైఎస్సార్ సీపీ అభిమాని కె.సాయిశ్రీనివాస్ ప్రచారం చేశారు.
అక్కడ మాజీ మంత్రి పార్థసారథి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపిన సయ్యద్ అజ్మతుల్లా గెలుపునకు సాయి శ్రీనివాస్ ఆటంకంగా మారారు. ఇది సారథికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకేముంది సదరు మాజీ మంత్రి అగ్గిమీద గుగ్గిలమై 9393610113 నంబరు నుంచి ఫోన్ చేసి సాయిశ్రీనివాస్‌తో దుర్భాషలాడారు. బెదిరించారు. ‘ఏరా సాయి.. ఒళ్లు బలిసిందా.. నాతో పనులు చేయించుకుని వాడెమ్మట తిరుగుతావా.. వైఎస్సార్ సీపీకి మద్దతుగా వెళ్తే నీ అంతు చూస్తా.. నా మద్దతుదారుడికే చేయ్.. లేకుంటే తొక్కేస్తా..’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ విరుచుకుపడ్డారు.
దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఈ విషయాన్ని రజకసంఘం, పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు చాగంటి సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, బాపట్ల సుబ్బారావు స్థానిక రాయల్ సమావేశపు హాల్లో శనివారం సమావేశమై మాజీ మంత్రి సారథి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలానే మరికొందరి వ్యాపారులపైనా సారథి, ఆయన అనుచరులు చిందులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘నేను అధికారంలో ఉండగా పనులు చేయించుకుని ఇప్పుడు షాపుల్లో కూర్చుంటారా. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లకపోతే మీ అంతు చూస్తా..’ అంటూ బెదిరిస్తున్నట్లు పట్టణం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే సారథి అనుచరుల ఆగడాలు మరింత పెరిగాయి. ఓ బడా వ్యాపారి వద్దకు వెళ్లి చందా అడగ్గా, ఆ వ్యాపారి కొంత మొత్తం ఇచ్చాడు. ‘ఈ మొత్తం చాలదు. నీవు లక్ష ఇవ్వాల్సిందే’ అంటూ పట్టుబట్టాడు సదరు మాజీ మంత్రి అనుచరుడు. దీంతో నివ్వెరపోయిన ఆ వ్యాపారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండగా, ఓ మధ్యవర్తి జోక్యం చేసుకుని మధ్యేమార్గంగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది.