ఖాకీలకు ఎన్నికల పరేషాన్
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగానికి గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పని ఒత్తిడి పెరిగింది. గతంలో సార్వత్రిక ఎన్నికల వరకు బందోబస్తు నిర్వహించి, కౌంటింగ్ ముగియగానే సేద తీరేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులు స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఉత్తర్వులు ఇవ్వడంతో ఒకటిన్నర నెల వ్యవధిలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.
ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్‌లో మొదటి విడత పరిషత్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలను భద్రపరచడం, బ్యాలెట్‌బాక్స్‌లకు భద్రత కల్పించడం కత్తిమీద సాముగా మారింది. ఇందు కోసం పారా మిలటరీ దళాలతోపాటు, స్థానిక ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను ఉపయోగించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఒకేసారి మూడు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్‌బాక్స్‌లు భద్రపరచాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి.
తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసులు మున్సిపల్ ఎన్నికలకు ఆయా మున్సిపాల్టీల్లోనే స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పా టు చేసి భద్రత కల్పిస్తున్నారు. దీనికితోడు మూడు డివిజన్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఆయా డివిజన్లలోనే స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి భద్రత కల్పించాల్సి ఉంది. ఇప్పటికే మదనపల్లె పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేసి భద్రపరిచారు. ఏప్రిల్ 11న జరిగే చిత్తూరు, తిరుపతి రెండు డివిజన్ల పరిషత్ ఎన్నికల బ్యాలెట్‌బాక్స్‌లకు కూ డా స్ట్రాంగ్‌రూమ్‌లు అవసరం.
ఈ రెండు ఎన్నికల ఫలితాలు మే 7వ తేదీ సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాకే వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు వీటిని కాపలా కాయాల్సి రావడం పోలీసులకు అదనపు భారంగా మారింది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో గ్రామ గ్రామానికి, ప్రతి పోలింగ్‌బూత్‌కు భద్రత కల్పించాల్సి ఉంది. ఇందు కోసం వేల సంఖ్యలో కేంద్ర పారా మిలటరీ దళాలను రంగంలోకి దించుతున్నారు.
స్ట్రాంగ్‌రూమ్‌ల వివరాలు
జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన తరువాత ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూములను అన్నినియోజకవర్గాలకు చిత్తూరులోనే ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ పూర్తి అయిన సాయంత్రమే ఈవీఎంలను చిత్తూరుకు తరలించనున్నారు.
చిత్తూరు లోక్‌సభతోపాటు, అన్ని నియోజకవర్గాల ఈవీఎంలను చిత్తూరు సమీపంలోని ఎస్‌వీ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి , కౌంటింగ్ చేపడుతారు.
తిరుపతి, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మన జిల్లాలో వచ్చే నియోజకవర్గాల ఈవీఎంలను చిత్తూరు సమీపంలోని సీతమ్స్ కళాశాలలో భద్రపరచి కౌంటింగ్ చేపడతారు.
భద్రతా పరంగా సాయుధ పారా మిలటరీ దళాలకు స్ట్రాంగ్‌రూంల భద్రత అప్పగిస్తారు. ఆ పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుమతి లేనిదే ఎన్నికల సిబ్బందిని కూడా స్ట్రాంగ్‌రూంల వద్దకు అనుమతించరు.
రెండో విడత పరిషత్ ఎన్నికలకు భారీ బందోబస్తు
జిల్లాలో జరిగే రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు పోలీసు జిల్లాతో పాటు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని తిరుపతి డివిజన్‌లోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఎస్పీ పీహెచ్‌డీ రామక్రిష్ణ, అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఎన్నికల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. చిత్తూరు ఎస్పీ పరిధిలోని 25 మండలాల్లో భద్రత వివరాలు.... ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్పీలు 2 , డీఎస్పీలు 10 మంది ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తారు. సీఐలు 17, ఎస్‌ఐలు 75, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు 285, కానిస్టేబుళ్లు 820, స్పెషల్ పార్టీ పోలీసులు 190, నాలుగు సెక్షన్ల పారా మిలటరీ బలగాలను బందోబస్తు నిర్వహించనున్నారు.