బోగస్ ఓట్లతో మున్సిపల్ ఎన్నికలు!
పాత ఓటరు జాబితాలో 5 వేల బోగస్ ఓట్లు
ఆగమేఘాలపై కుల గణన సర్వే
పాత జాబితాతో గద్దెనెక్కేందుకు కుయుక్తులు
చక్రం తిప్పిన మాజీ నేత కొత్త ఓట్లతో జరపాలంటున్న {పతిపక్షాలు
కర్నూలు(జిల్లా పరిషత్) : బోగస్ ఓట్లతో కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించి కంగుతిన్న ఓ నేత ఈసారి కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలపై దృష్టి సారించారు. ఎలాగైనా మేయర్ పీఠాన్ని తన వారికి కట్టబెట్టేందుకు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకవైపు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మరోవైపు సదరు నేత రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆగమేఘాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గణన కోసం ఇంటింటి సర్వే కోసం ఉత్తర్వులు తీసుకొచ్చారు. బుధవారం నుంచి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఈ సర్వే ప్రారంభం కానుండటం వివాదస్పదమవుతోంది. కర్నూలు నగర పాలక సంస్థలో ఇటీవల విలీనమైన మూడు గ్రామాల ఓటర్లతో కలిపి 51 వార్డులు(డివిజన్లు)గా విభజించారు. ఈ డివిజన్లలో 3.94 లక్షల ఓటర్లు ఉన్నారు. సాదారణ ఎన్నికలకు ముందే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్నా విలీన గ్రామాల కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన ప్రక్రియను మున్సిపల్ అధికారులు పూర్తి చేశారు. వార్డుల సంఖ్య 50 నుంచి 51కి చేరింది.
కర్నూలు కార్పొరేషన్‌లో కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల ఓటర్లు ఉన్నారు. ఆయా వార్డుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే చేసేందుకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కొత్త ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం జనవరి 20వ తేదీ వరకూ ఉంది. అయినప్పటికీ పాత ఓటర్లతోనే ఇంటింటి సర్వే చేయడం వెనుక ఉద్దేశం ఈ బోగస్ ఓట్లేనని తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల జారీ వెనుక కర్నూలు నగరానికి చెందిన ఓ మాజీ నేత పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
బోగస్ ఓట్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు..!
గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ నేత భారీగా బోగస్ ఓట్లను చేర్చినట్లు అప్పట్లో వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం నాయకులు జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, ఎంఆర్‌వోలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్రతి వార్డులో 20 నుంచి 300 వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అయినా జాబితాను సవరించకుండా ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 20వ తేదీ నాటికి గానీ పూర్తిస్థాయిలో కొత్త జాబితా తయారయ్యే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసింది.
ఎత్తుగడ!
Published Wed, Dec 10 2014 2:26 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement