
అనంతపురం టౌన్: రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన నివాసరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు టీడీపీలో చేరాను తప్ప...తన స్వప్రయోజనాలు, పదవులను ఆశించి పోలేదన్నారు. అయితే చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదన్నారు.
కేవలం సొంత అభివృద్ధే అజెండాగా పని చేస్తున్నాడని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా నీటితో కరువు జిల్లాకు సాగునీరు అందిస్తారనుకుంటే అరకొరగా చెరువులు నింపడం తప్పితే ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదన్నారు. రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కాస్తా...ఒట్టిసీమగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సాకుగా చూపుతూ.. బీజేపీపై బురదజల్లే విధంగా వ్యవహరిస్తున్నాడు తప్పితే.. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. 60 ఏళ్లు ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర విభజనతో ఏపీలో ఏమైందో అందరికి తెలుసన్నారు.
అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు రాష్ట్రానికి మేలు చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అనైతిక పొత్తులను ప్రజలు స్వాగతించరన్నారు. ఇందుకు తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. చిత్తశుద్ధిలేని టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారమవుతామన్నారు. చిన్న పొరపాటుతో అనాడు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చింది తప్పితే... మరొకటి కాదన్నారు.
ఆ పొరపాటును సరిదిద్దుకుంటామన్నారు. ఆ రోజు మా వెంట నడిచిన ప్రతి ఒక్కరూ నేడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మేమంతా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు షుకూర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ కార్పోటర్లు వెంకటేశ్‌చౌదరి, మల్లికార్జున, వెంకటసుబ్బయ్య, డివిజన్ కన్వీనర్ చేపల హరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment