
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్ రామంతాపూర్‌లో గుండెపోటుతో మృతిచెందారు. మజ్జి శారద ఆదినుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పలాస నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఘోరంగా ఓటమి చవిచూశారు.
దివంగత పీసీసీ అధ్యక్షుడు మజ్జి తులసిదాస్ పెద్ద కుమార్తె మజ్జి శారద. తండ్రి మరణాంతరము 1994లో గ్రూప్ వన్ అధికారి ఉద్యోగాన్ని విడిచి తండ్రి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్ కోటా కింద పదవిని దక్కించుకున్న మజ్జి శారద నాలుగేళ్లకే పరిమితమయ్యారు. ఈమె పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందించారు.