'ప్రభుత్వ ఉత్తర్వులు ఆచరణలో లేవు'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం తెలుగులో ప్రచురించిన శిలాఫలకం సీఆర్‌డీఏ ఆఫీస్‌లో ఒక మూలన మూలుగుతుందని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వతీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా దాన్ని బయటకు తీసి రాజధాని ప్రారంభోత్సవ శిలాఫలకం పక్కన పెట్టాలన్నారు.
రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. పవిత్ర సంగమం వద్ద రూ.100 కోట్ల ఖర్చుతో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునురాలోచించుకోవాలన్నారు. తెలుగు సంస్కృతి వికాసం కోసం పాటుపడిన తెలుగు వారి విగ్రహాలు నెలకొల్పాలన్నారు. ఠాగూర్ విగ్రహం పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా మన రాష్ట్రానికి చెందిన వారి విగ్రహమే పెడతామని చెప్పాలి. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆచరణ కావడం లేదన్నారు.