విత్తనమేదీ ? | formers are feeling difficulties for rains | Sakshi
Sakshi News home page

విత్తనమేదీ ?

Published Sun, Jul 27 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

విత్తనమేదీ ?

విత్తనమేదీ ?

బాపట్ల: వర్షభావం ఖరీఫ్ రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితుల్లో వరిసాగుకు వెదపద్ధతి అనుకూలమని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరో వైపు వరి వంగడాల కొరత రైతులను వేధిస్తోంది.వెద పద్ధతికి అనుకూలమైన వంగడాలు లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో బీపీటీలో 2270 రకం భావపురి సన్నాలు, ఎం.టి.యు 1010, ఎన్.ఎల్.ఆర్ 4449 రకం వంగడాలను వెదపద్ధతిలో మంచి లాభాలు తెచ్చిపెడతాయని శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి కూడా సూచించారు. అయితే వీటి లభ్యతపైన ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వరిని ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. ఏటా సుమారు 2.40 లక్షల హెక్టార్లలో సాగవుతోంది.ఎక్కువ మంది రైతులు బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 145, ఎన్‌ఎల్‌ఆర్ 33892 రకాలను సాగు చేస్తుంటారు. ఈ వంగడాలు ఎక్కువగా  రైతుల వద్ద లభ్యమవుతుంటాయి. అలాగే విత్తన దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.
 
 శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వంగడాలు
 ఈ ఏడాది వర్షభావ పరిస్థితుల కారణంగా వెద పద్ధతితోనే సాగు చేయాలని వరి పరిశోధనా కేంద్రం ప్రభుత్వానికి నివేదిక పంపింది.బాపట్ల వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జె.వి.రమణ ప్రతిపాదనల ప్రకారం ఈ ఏడాది వేయగలిన వరి వంగడాల్లో ఎంటియు 1010, ఎన్‌ఎల్‌ఆర్ 4449 రకం 120 నుంచి 125 రోజుల్లో పంటచేతికొస్తుందని తెలియజేశారు. ఎకరాకు 55 బస్తాల వరకు పండే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితిల్లో సైతం నాట్లు పడటంతోపాటు, అగ్గితెగులు సమస్య నుంచి తప్పించుకునేందుకు ఈ రకమైన సీడ్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. బీపీటీలో 2270 రకం భావపురి సన్నాలను ప్రతిపాదించారు. ఈ వంగడం 160 రోజుల్లో కోతకు వస్తుంది. దోమ పోటును తట్టుకునే శక్తి ఉంటుంది.
 
 ప్రతిపాదిత రకాల విత్తన కొరత
 ప్రభుత్వానికి ఎంటియు 1010, ఎన్‌ఎల్‌ఆర్ 4449, బీటీపీ 2270 రకాల విత్తనాలు ప్రతిపాదించారు. అయితే ఈ విత్తనాలకు ఎలాంటి రాయితీలేకపోగా కనీసం సీడ్ దొరికే పరిస్థితి కనిపిం చటం లేదు. కేవలం బీపీటీ 5204 రకం వంగడం కిలో రూ. 27.50 కాగా, రూ.5 సబ్సిడీ వుంటుంది. అయితే ఈ ఏడాది ప్రతిపాదించిన రకాలకు సబ్సిడీ లేదంటున్నారు.
 
 వెద పద్ధతిలో ఉపయోగాలు
 వర్షాలు కురిసిన వెంటనే సాగు చేసుకోవచ్చు. నాట్లు వేసేటప్పుడు అవసరమయ్యే నీరు ఆదా అవుతుంది. ఒక గంటలో ఒక ఎకరం విత్తవచ్చు.పంట ఏడు నుంచి పది రోజుల ముందుగా కోతకు వస్తుంది. తక్కువ ఖర్చుతో అధిక నికరాదాయం పొందువచ్చు.
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 సరైన లోతులో విత్తనాలు నాటుకోవాలి.ప్రారంభ దశలో ఎదురయ్యే కలుపును నిర్మూలించాలి. చౌడుభూములు, ఉప్పు నేలలు అనుకూలం కావు.పొలాన్ని సంప్రదాయ పద్ధతుల్లో దున్నకుండా, విత్తన గొర్రు ఉపయోగిస్తే కనీసం 2-4 సెంటీమీటర్ల వెడల్పు, 4-7 సెంటీమీటర్ల లోతు గాడులు ఏర్పడి అందులో విత్తనాలు సమానలోతు, దూరంలో నాటుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement