ప్రజల కష్టాలను అన్నలా అర్థం చేసుకుని స్నేహితునిగా తోడు నిలుస్తూ పార్టీలకు అతీతంగా తన వంతు సహాయం చేయడమే ఎస్వీ మోహన్‌రెడ్డిని ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడిగా జిల్లాకు సుపరిచితుడు. సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్న ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వైఎస్ కుటుంబమంటే ఎనలేని అభిమానం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయనకు తోడుగా నిలవాలనే సంకల్పంతో తన ఎమ్మెల్సీ పదవిని త్యజించారు. రాజీనామా చేసి పూర్తిస్థాయి సమయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవల్లోనే వినియోగించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న టి.జి.వెంకటేశ్‌పై విజయం సాధించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా తనను ఆదరించిన ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై అలుపెరుగని పోరుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు అండగా నిలిచి మీ కోసం నేనున్నానని నిరూపించుకున్నారు. ముస్లింల సమస్యలపై అసెంబ్లీలో సైతం పోరాడే నేతగా ఆయన మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా నగరపాలక సంస్థ అధికారులను వెంట బెట్టుకుని నిత్యం వార్డు విజిట్ నిర్వహిస్తూ ఎన్నోరకాల వార్డు సమస్యలను పరిష్కరించగలిగారు. ప్రజల కష్టాలను లోతుగా అధ్యయనం
చేసేందుకు ‘సాక్షి’ తరపున కర్నూలు నగరంలోని బుధవారపేటలో
పర్యటించి వీఐపీ రిపోర్టింగ్ చేశారు.
ఎస్వీ : ఏమ్మా బాగున్నారా.. మీ పేర్లేంటి? కాలనీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
కాలనీవాసులు : నా పేరు జైబున్‌బీ సార్.. భర్త లేడు.. ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి పింఛన్ జాబితాలో పేరు నమోదు చేయిస్తే..ఒక్క నెల మాత్రమే పింఛన్ వచ్చింది. అంతలోపే కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న పింఛన్ కాస్త తొలగించింది. దీంతో గత మూడు నెలలుగా పింఛను రావడం లేదు. సర్.. నా పేరు ఖాజాబీ. కొడుకులు లేరు. పింఛన్ కూడా రావడం లేదు. ఇప్పించండి సార్.. నా పేరు వెంకటరమణ.. వికలాంగుడిని సార్. పింఛను ఇప్పించండి. నా పేరు సర్వేశ్వర్.. ఆక్సిడెంట్‌లో కాలు విరిగింది. ప్రస్తుతం నడవనిలేని పరిస్థితి. నాకు పింఛను ఇప్పించండి..
ఎస్వీ : అంగవైకల్యం.. 70 శాతంపైగా ఉన్న వారికి మాత్రమే వికలాంగ పింఛన్ వస్తుంది. అలాంటి వారు దరఖాస్తులు నాకు ఇవ్వండి. అధికారులతో మాట్లాడి పింఛను ఇప్పించేందుకు ప్రయత్నిస్తాను. జగన్ సీఎం అయి ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు చంద్రబాబు పాలన సాగుతోంది. పింఛన్ల తొలగింపుతో చాలా మంది అర్హులు పింఛన్లు కోల్పోయారు. అయినా అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతాను.
ఎస్వీ : పెద్దమనిషి, మీ వీధిలో సమస్యలు ఏవైనా ఉన్నాయా..?
కాలనీవాసులు: సార్, నా పేరు మాలిక్‌బాష. మా ఇంటి ముందే కరెంటోళ్లు డీప్(టాన్స్‌ఫార్మర్) ఏర్పాటు చేశారు. చాలా ప్రమాదకరంగా ఉంది. దాన్ని ఇక్కడ్నించి తీసేయించండి సార్..
ఎస్వీ : సంబంధిత అధికారులతో మాట్లాడి కరెంటుకు సంబంధించిన డీప్‌ను పక్కకు జరిపిస్తా.
ఎస్వీ : ఏం బాబు.. బాగున్నావా.. నీలాంటి యువకులకు ఇబ్బందులు ఏమీ లేవు కదా..
మణికంఠ: ఏం చెప్పమంటారు సార్.. ఎన్నికల ముందేమో నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాకు నెలకు రూ. 2 వేల కాదు కదా రెండు రూపాయలు కూడా ఇవ్వడం లేదు. మా వీధిలో చాలా మంది చదువుకున్నోళ్లు ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నారు.
ఎస్వీ : ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నాయకుని లక్షణం. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో అధికార పార్టీ నేతల్ని నిలదీయండి.
ఎస్వీ : ఏమన్నా.. వ్యాపారం ఎలా ఉంది.. గ్యాస్ సిలిండర్ ఎంతకు కొంటున్నావ్.. సమస్యలు ఏమైనా ఉన్నాయా.. మంచినీళ్లు బాగా వస్తున్నాయా?
శ్రీనివాసులు: వ్యాపారం డల్‌గా ఉంది సార్. సిలిండర్ ఒక్కోటి రూ. 850 దాకా పెట్టి కొనాల్సి వస్తుంది. నా తల్లికి పింఛన్ రావడం లేదు. కాలువలు సరిగ్గా లేవు. మంచినీళ్లు బాగానే వస్తున్నాయి.
ఎస్వీ : ఏమ్మా ఇస్త్రీపని బాగా జరుగుతోందా.. మీ కుటుంబానికి ఏవైనా సమస్యలున్నాయా..
శిరీష: నేను ఆరో తరగతి చదువుతున్నా సార్. నాన్న చనిపోయాడు. దీంతో మధ్యలోనే చదువు మానాల్సి వచ్చింది. అమ్మే నన్ను కష్టపడి పోషిస్తోంది. ఇప్పుడు అమ్మకు తోడుగా నేను లాండ్రీ పని చేస్తున్నా అయితే మా అమ్మకు వితంతు పింఛన్ రావడం లేదు సార్.. మీరు దయవుంచి అమ్మకు పింఛను వచ్చేలా చూడండి
ఎస్వీ : ఈ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు తొలగించిందమ్మా.. మీ అమ్మకు పింఛన్ వచ్చేలా ప్రయత్నిస్తా.
ఎస్వీ : ఏమ్మా.. పొదుపు మహిళా సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. లోన్లు ఏమైనా వచ్చాయా..
వనజ: సార్.. లోన్ల సంగతి ఏమోకాని ఉన్న డబ్బు కూడా పోతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు తీసుకున్న రుణాల కంతులు కట్టడం మానేయమని చెబితే మానేశాం. ఇప్పుడేమో బ్యాంకు వాళ్లు వడ్డీలు వసూలు చేస్తున్నారు. కట్టకపోతే అసలులో కట్ చేస్తున్నారు. కూడబెట్టిన డబ్బంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సంక్రాంతికి పిల్లలకు బట్టలు కూడా కొనలేని పరిస్థితి కల్పించారు.
ఎస్వీ : చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు. రుణమాఫీ అయ్యేంతవరకు మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పోరాడుతాం. ఈనెల 31 నుంచి రెండు రోజుల నిరాహార దీక్షలు చేస్తున్నాం.
ఎస్వీ : ఏమ్మా బాగున్నారా.. సమస్యలేమైనా ఉన్నాయా..
మహిళలు: నా పేరు వెంకటేశ్వరమ్మ. వెయ్యి రూపాయల పింఛన్ ఉత్త డూప్ సార్.. ఆశ చూపి ఉన్న పింఛన్లు తీసేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అందరికి పింఛన్లు వచ్చేవి. చంద్రబాబు పాలనలో ఉన్న పింఛన్లు పోయాయి. సర్, నాపేరు మారెమ్మ. నా వయస్సు 75 ఏళ్లు. 10 నెలలుగా పింఛను రావడం లేదు. జాబితాలో పేరు లేదంటున్నారు. మీరైనా దయచేసి న్యాయం చేయండి
ఎస్వీ : పీఏ శ్రీనివాసులు.. వీరందరితోనూ పింఛను దరఖాస్తులు తీసుకో. మీకు పింఛన్లు కచ్చితంగా వచ్చేలా కృషి చేస్తాను.
ఎస్వీ : అమ్మాల్లరా ఏైైమైనా సమస్యలు ఉన్నాయా?
ఎస్.చిట్టి: సర్, ఇక్కడ మహిళలకు మరుగుదొడ్లు లేవు సార్. మురుగు నీరు రోడ్డుపైన పారుతుంది. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కావడం లేదు. రుణాలు ఇవ్వడం లేదు. వడ్డీలు మళ్లీ కట్టాలంటున్నారు. ఎలా కట్టాలో తెలియడం లేదు.
ఎస్వీ : పురపాలక సంస్థ అధికారులతో ప్రతిపాదనలు చేయించి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తా. మురుగునీటి సమస్యా పరిష్కరిస్తా. (మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు పీఏ ఫోను కలిపి ఇవ్వడంతో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అక్కడిక్కడే శానిటరీ అధికారికి డ్రైనేజీ సమస్యను వివరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.) చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వస్తువులను కాలనీవాసులు కాలువల్లో వేయకండి. అలా వేయడం వల్లే కాలువలు బ్లాక్ అవుతున్నాయి.
ఎస్వీ : (పూరి గుడిసెలోకి వెళ్లి) అవ్వా.. క్షేమమేనా..
నాగమ్మ, రాములమ్మ: ఏం చెప్పమంటావు నాయనా.. ఆధార్ లేదని పింఛన్ ఇవ్వట్లేదు. ఆమెకు మొదట్నుంచి రావడంలేదు.
ఎస్వీ : అవ్వా నీకు పింఛను ఇప్పించేందుకు ప్రయత్నిస్తా.
ఎస్వీ : ఏమన్నా.. పులిజాకబ్, చేపలకుంట వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా..
పులిజాకబ్(స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్): సార్, చేపలకుంట గుంత 60, 70 ఏళ్లుగా ఉంది. ఇక్కడ రైతు మార్కెట్ లేక స్కూల్ కట్టివ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. స్థానికులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ప్రతిపాదిస్తుండటంతో సమస్య పెండింగ్‌లో ఉంది. గట్టి నిర్ణయం తీసుకోండి.
ఎస్వీ : ఈ గుంత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి?
ఏసన్న (స్థానిక నేత): గుంత చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉంది. పొరపాటున పడితే బయటికి రాలేరు. డ్రైనేజీ నీరు కూడా చేరుతుంది. దోమలతో ఇబ్బందులు పడుతున్నాం.
ఎస్వీ : ఈ గుంత ఇబ్బందుల గురించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కూడా ప్రస్తావించాను. మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా.
ఎస్వీ : ఏమమ్మా.. మీ సమస్యలేవైనా ఉన్నాయా?
మారెమ్మగుడి కాలనీవాసులు: సార్, మరుగుదొడ్లు ఉపయోగించేందుకు వీలుగా లేవు. సింటెక్స్ ట్యాంకు పగిలింది. గోడల ఎత్తు తక్కువగా ఉండటంతో పురుషుల కంట పడాల్సి వస్తుంది.
ఎస్వీ : (నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్‌లో) మారెమ్మగుడి వద్ద ఉన్న మరుగుదొడ్లు చెడిపోయాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టండి. మరొక సింటెక్స్ ట్యాంక్ పెట్టి మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడండి.
ప్రజా సమస్యలే అజెండా.....
Published Sun, Jan 18 2015 3:16 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement
Advertisement