నకిలీ కరెన్సీ గుట్టు రట్టు
Published Fri, Sep 13 2013 5:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
డెంకాడ, న్యూస్‌లైన్: నకిలీ కరెన్సీ చెలామణి చేస్తూ నలుగురు వ్యక్తులు పోలీసులకు గురువారం అడ్డంగా దొరికిపోయారు. మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద ఒక పాన్‌షాప్ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి కొబ్బరి బొండాలు తీసుకున్నారు. షాపు యజమానికి వారు రూ.100 నోటు ఇవ్వగా, యజమాని దాన్ని నకిలీ నోటుగా గుర్తించారు. దీనిపై వారితో వాదనకు దిగారు. అంతలోనే ఆ ఇద్దరికి మరో ఇద్దరు తోడై షాపు యజమానితో ఘర్షణకు దిగారు. దీంతో యజమాని స్థానికుల సహాయంతో డెంకాడ ఎస్‌ఐ సి.హెచ్.శ్రీధర్‌కు సమాచారాన్ని చేరవేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరి వద్దనున్న నకిలీ నోట్లను కూడా స్వాధీన పరచుకున్నారు. వీరు నలుగురూ విశాఖ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. వీరికి నకిలీ కరెన్సీ ఎలా వచ్చింది, ఎవరెవరు వీరిని వెనుకనుంచి నడిపిస్తున్నారు, నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కడ ముద్రిస్తున్నారు, ఎప్పటి నుంచి చెలామణి చేస్తున్నారు వంటి విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. గురువారం రాత్రి డెంకాడ పోలీసు స్టేషన్‌లో నలుగురు అనుమానితులను డీఎస్పీ కృష్ణప్రసన్న, సీఐ ప్రవీణ్‌కుమార్ విచారించినట్లు తెలిసింది.
‘రూ.పదివేలు నకిలీ కరెన్సీ గుర్తించాం’
ఇదే విషయమై భోగాపురం సీఐ ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద నకిలీ కరెన్సీ చెలామణీ చేస్తుండగా డెంకాడ పోలీసులకు సమాచారం అందిందని చెప్పా రు. అక్కడకు వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
ఈ నలుగురి వద్ద నుంచి సుమారు పదివేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు విశాఖ జిల్లాలోని పోతుల మల్లయ్యపాలెం, భీమిలికి చెందినవారని చెప్పారు. నకిలీ కరెన్సీ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Advertisement
Advertisement