ఒంగోలు/కొత్తపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికలు నిలిచిన ఏడు గ్రామాలకు త్వరలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈమేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంగళవారం ముందస్తు సమాచారం అందించింది. దీనికి సంబంధించి పూర్తి ఆదేశాలు బుధవారం జిల్లా యంత్రాంగానికి రానున్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థలో కొత్తపట్నం మండలంలోని అల్లూరు, కొత్తపట్నం, కొత్తపట్నం పల్లెపాలెం, గవండ్లపాలెం, ఒంగోలు మండలంలోని సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం, సంతనూతలపాడు మండల పరిధిలోని మంగమూరు పంచాయతీలను విలీనం చేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలనా విభాగం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రధానంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాసిన లేఖ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈదశలో తమ గ్రామాలను ఒంగోలు నగర పాలక సంస్థలో కలపడంపై అసంతృప్తి చెందిన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఈ వ్యవహారంపై స్టే విధించింది. దీంతో అల్లూరు రెవెన్యూ పరిధికి సంబంధించి నలుగురు కోర్టును ఆశ్రయించగా సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం, మంగమూరుకు చెందిన వారు విడివిడిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్టే ఉత్తర్వులున్నప్పటికీ వాటిని పంచాయతీలుగా గుర్తించకుండా జిల్లా ఎన్నికల అధికారులు వాటిని 2013 జులైలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పొందుపరచలేదు. దీనిపై మళ్లీ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ గ్రామాలను పంచాయతీలుగానే గుర్తించి ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు. అయితే దానిపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
తాజాగా జిల్లా పంచాయతీ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరి 4, 5 తేదీల్లో ఈ ఏడాది పంచాయతీలకు నోటిఫికేషన్ విలువడే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు కూడా జనవరి 20వ తేదీలోగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం 7 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక కొత్తపట్నం మండల పరిధిలోని నాలుగు పంచాయతీల్లోనే ఎన్నికలుంటాయా అనేది స్పష్టం కావాల్సి ఉంది.
నిలిచిన పంచాయతీల ఎన్నికలకు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్
Published Wed, Jan 1 2014 5:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement