
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వెలువడే పక్షంలో ఉగాది లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక దశకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఓటింగ్, లెక్కింపు అన్నీ పండుగ లోపే పూర్తి చేయటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ దీనిపై చర్చించేందుకు శుక్రవారం పోలీసు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి ఎస్.రామసుందర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు.
ఆగిన నిధులు రూ.5,000 కోట్లకుపైనే
స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందువల్ల 2018 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు ఆగిపోగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రూ.1,400 కోట్లు దాకా నిధులు నిలిచిపోయాయి. మార్చి నెలాఖరుతో 14వ ఆర్థిక సంఘం ఐదేళ్ల గడువు ముగుస్తున్నందువల్ల ఆ నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదారు నెలలుగా అన్ని చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ గతంలోనే ప్రకటించారు.
నేడు లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశం
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై టీడీపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. హైకోర్టు తన తీర్పును శనివారం లేదంటే సోమవారం వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీర్పు అనుకూలతను బట్టి మార్చి నెలాఖరులోగా ఎన్నికలు జరిపి కేంద్రం నుంచి నిధులు తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉగాదిలోపే ఒక దశ ఎన్నికల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తోంది.
పరీక్షల మధ్య సెలవు తేదీల్లో..
ఇంటర్, పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ మధ్య వరకు జరగనున్నాయి. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలకు మధ్య ఎక్కువ సెలవులు ఉన్న తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అందుకనుగుణంగా పోలీసు భద్రత కల్పించడంపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలు తెప్పించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ సూచించారు. దీనిపై రెండు రోజుల్లో పోలీసు శాఖ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేస్తామని శాంతిభద్రతల విభాగపు అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఒకవేళ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన పక్షంలో అందుకనుగుణంగా ఇప్పటికే ఖరారు చేసిన రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు ఎంత వేగంగా చేయగలరనే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment