ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఈ నెల 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నప్పటికీ.. తూర్పు గోదావరి జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం మ.2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో శాంతిభద్రతల అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు.. ఆ జిల్లాలో ఏటపాక మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు వీఆర్ పురంలోని చినమట్టపల్లి ఎంపీటీసీ, మారేడుమిల్లి మండలంలోని దొరచింతలవాని పాలెం ఎంపీటీసీ పోలింగ్ సా.5 గంటల వరకు కాకుండా మ.2 గంటల వరకే కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు.
14, 16 తేదీల్లో సెలవు: ఇక గ్రామ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే చోట ఈ నెల 14న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట ఈనెల 16న ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర అన్ని రకాల సంస్థలకు సెలవు ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు జరిగే చోట పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట 48 గంటల ముందు నుంచి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని కూడా ఉత్తర్వులిచ్చారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు వివిధ కార్పొరేషన్‌లలో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా 8 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచినట్టు తెలిసింది. అనధికారికంగా అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఒక వార్డులో, గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వార్డు, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మినహా మిగిలినవారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవమేనని, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని సమాచారం. గతంలో ఎన్నికలు నిలిచిన, గెలిచినవారి మరణంతో ఖాళీ అయిన వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ తరహాలో ఎన్నికలు జరుగుతున్న గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపాలిటీలోని 8వ వార్డు, రేపల్లెలోని 16, మచిలీపట్నంలో 32, నూజివీడు 27వ వార్డులో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment