వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి | Four men killed in separate road accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

Published Fri, Sep 6 2013 5:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Four men killed in separate road accidents

జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు, చెరువులో మునిగి ఒక బాలిక మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు అరబిందో పరిశ్రమ కార్మికులు.
 
 లావేరు, న్యూస్‌లైన్: లావేరు, రణస్థలం మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. వారిద్దరూ అరబిందో పరిశ్రమ కార్మికులు. గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ సంఘటనలు జరిగాయి.
 
 మండలంలో జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. లావేరు గ్రామానికి చంఎదిన రేగాన విజయ్, పోతిరెడ్డి పరశురాం, పోతిరెడ్డి, గోవింద్, ఎర్రా సాంబశివరావు రణస్థలం మండలం పైడి భీమవరంలోని అరబిందో పరిశ్రమలో పని చేస్తున్నారు. రణస్థలం మండలం పైడిపేటకు చెందిన ఆటోలో రోజూ పరిశ్రమకు వెళతారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఎ-షిఫ్ట్‌కు లావేరులోని కార్మికులతో పాటు చిగురుకొత్తపల్లి గ్రామంలోని కార్మికులను తీసుకువెళ్లేందుకు ఆటో చిగురుకొత్తపల్లి జంక్షన్ వద్దకు వచ్చింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళుతున్న లారీ ఆటోను ఢీకొనడంతో రేగాన విజయ్, పోతిరెడ్డి గోవింద్, పరశురాం, ఎర్రా సాంబశివరావు, ఆటో డ్రైవర్ దొండపాటి దామోదరరావులకు గాయాలయ్యాయి. బాధితులను 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విజయ్ రిమ్స్‌లో మృతి చెందారు.
 
 సమాచారం తెలిసిన వెంటనే లావేరు ఎస్‌ఐ రామారావు, హెచ్‌సీ దేవదానం, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు సేకరించారు. రిమ్స్‌కు వెళ్లి మృతదేహానికి శవపంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్‌కు భార్య అమ్మన్న, కుమారుడు ప్రేమ్‌కుమార్ ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మృత్యువాతపడడంతో వారు బోరున విలపిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే లావేరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నిడిగంట్ల త్రినాథ్, లావేరు సర్పంచ్ మాకన శంకరరావు తదితరులు రిమ్స్‌కు వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. 
 
 రూ.1.60 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన అరబిందో యాజమాన్యం 
 కర్మాగారంలో పని చేసేందుకు వస్తుండగా ప్రమాదంలో మృతి చెందిన విజయ్‌కు రూ.1.60 లక్షలు ఎక్స్‌గ్రేషియాను అరబిందో పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిందని సీఐటీయూ నాయకులు గోవిందరావు, తేజేశ్వరరావు తెలిపారు. పరిశ్రమ జీఎం రాజారెడ్డి, హెచ్‌ఆర్ తిరుమల రావుతో సీఐటీయూ నాయకులు గోవింరావు, తేజేశ్వరరావు, మహేష్ జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకరించినట్లు తెలిపారు. మృతుడి కుమారుడికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం యాజమాన్యం ఇచ్చిన రూ. 7,500లను విజయ్ భార్య అమ్మన్నకు వారు అందజేశారు.  
 
 వైఎస్‌పై అభిమానం
 రేగాన విజయ్‌కు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అంటే వల్లమాలిన అభిమానం. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. ఇటీవల లావేరు పీఏసీఎస్‌కు జరిగిన ఎన్నికల్లో డెరైక్టర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన మృతికి వైఎస్సార్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, మండల కన్వీనర్ వట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు బాడిత వెంకటరావు, యూత్ కన్వీనర్ గొర్లె ప్రభాకర్ సంతాపం తెలిపారు.
 
 రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
 రణస్థలం: జేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై పైడిభీమవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లపేట గ్రామానికి చెందిన ఇప్పలి పైడిరాజు (23) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పైడిభీమవరంలోని అరబిందో పరిశ్రమలో పనిచేసేందుకు గొల్లపేటకు చెందిన పైడిరాజు, మట్ట వెంకటరమణ సైకిల్‌పై వస్తున్నారు. సైకిల్‌పై వెళుతున్న వారిని  పైడిభీమవరం వద్ద శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో పైడిరాజు మృతి చెందగా, వెంకటరమణ గాయాల పాలయ్యాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ వి.శ్రీనివాసరావు తెలిపారు.  
 
 సీఐటీయూ నాయకుల పరామర్శ
 రిమ్స్‌క్యాంపస్ : విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు అరబిందో ఫార్మా పరిశ్రమ కార్మికుల కుటుంబ సభ్యులను సీఐటీయూ నాయకులు గురువారం పరామర్శించారు. రిమ్స్ మార్చురీ వద్ద ఉన్న మృతదేహాలను పరిశీలించారు.  గాయాలతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని, రూ.1.60 లక్షలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం పరిశీలిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. పరామర్శించిన వారిలో సీఐటీయూ ఉపాధ్యక్షుడు పి.తేజేశ్వరరావు, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ నాయకులు కె.గురినాయుడు, ఎం.సూర్యారావు, పైడిభీమవరం సర్పంచ్ లంకలపల్లి ప్రసాదరావు, సీఐటీయూ రణస్థలం మండల అధ్యక్షులు ఆర్.రాము, కార్మిక నాయకులు నర్సింహులు, గోపి తదితరులు ఉన్నారు.
 
 బైక్ ఢీకొని వృద్ధుడు, చెరువులో మునిగి బాలిక...
 టెక్కలి (నందిగాం) : స్నానానికి వెళ్లి చెరువులో మునిగి ఒక బాలిక మృతి చెందగా, స్నానం చేసి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందారు. ఈ ఘటనలు ఆ గ్రామా ల్లో విషాదాన్ని నింపాయి. నంది గాం మండలంలోని దీనబంధుపురం గ్రామానికి చెందిన పోలాకి పావని (11) బుధవారం సాయంత్రం స్నానం కోసం చెరువుకు వెళ్లింది. బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికారు. గురువారం ఉదయం చెరువులో బాలిక మృతదే హం తెలింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పావని తల్లిదండ్రులు సోమేశ్వరరావు, లక్ష్మి ఉపాధి కోసం చెన్నైలో పనులకోసం వెళ్లారు. దీనబంధుపురంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న పావని స్థానికంగా ఐదో తరగతి చదువుతోంది. కుమార్తె మృతి వార్త తెలిసిన వెంటనే చెన్నై నుంచి తల్లిదండ్రులు బయలుదేరారు. 
 
 రోడ్డు దాటుతుండగా...
 మర్లపాడు గ్రామానికి చెందిన రైతు బొండ చిన్నబాబు (65) ద్విచక్రవాహనం ఢీకొని మృతి చెందాడు. మర్లపాడు సమీపంలోని వంశధార కాలువలో గురువారం స్నానం చేసి రోడ్డు దాటుతున్న చిన్నబాబును ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నబాబును పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెచ్‌సీ హేమసుందరరావు కేసు నమోదు చేశారు. 
 
 ఈ ఘటనకు కారణమైన బెండి గేటు నుంచి పూండి వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్న వజ్రపుకొత్తూరు మండలం చిన్నమరుహరిపురం గ్రామానికి చెందిన ఇనుమళ్ల త్రినాథరావు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. చిన్నబాబుకు   భార్య అప్పలమ్మ, కుమార్తె నారాయణమ్మ, కుమారుడు రాజారావు ఉన్నారు. కొడుకు రాజారావు ఆర్మీలో ఉన్నాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు రోదించారు. 
 
 వ్యాన్‌పై నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
 భామిని, న్యూస్‌లైన్: వ్యాన్‌పై నుంచి జారిపడిన ప్రయాణికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.  కొత్తూరు నుంచి బత్తిలి వెళుతున్న వ్యాన్‌పై గురువారం పక్కుడుభద్రకు చెందిన నిమ్మల వైకుంఠరావు అనే యువకుడు కూర్చుని ప్రయాణిస్తున్నాడు. భామిని మండలం బిల్లుమడ కాలనీ వద్ద వ్యాన్‌పై నుంచి జారిపడి గాయపడిన అతనిని స్థానికులు భామిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సీహెచ్ అనిల్‌కుమార్ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement