గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ.. జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది.
కుటుంబ సభ్యుల అనుమానం
మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా నాగోన్ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్‌ను సీన్ రీ క్రియేట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు.
చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు.
నిందితుడి లోంగుబాటు
ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను సుమిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమిత్‌ను జఖలబంధ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమిత్ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
స్పందించిన సీఎం
జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు.
కాబోయే భర్తను అరెస్ట్ చేయించి
ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్ కాప్ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్ పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి.
ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు.
ఎమ్మెల్యేతో వివాదం
గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment